AP: సుగంధ పరిమళాలు.. ఎగుమతులకు భారీ డిమాండ్‌

Export Of Spices From AP To Foreign Countries Are On The Rise - Sakshi

ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రాష్ట్రం నుంచి రూ.2,462.95 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాల ఎగుమతి

15.16 కోట్ల కిలోల మిర్చి, పసుపు, మిరియాలు ఎగుమతి

రూ.659.62 కోట్ల విలువైన 1.49 కోట్ల కిలోల కాఫీ కూడా..

సాక్షి, అమరావతి: మన రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు సుగంధ ద్రవ్యాల ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలం నాటికి రాష్ట్రం నుంచి 15.16 కోట్ల కిలోల సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయినట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. సుమారు 80కిపైగా దేశాలకు రూ.2,462.95 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలను మనం రాష్ట్రం ఎగుమతి చేసింది. రాష్ట్రంలో సాగవుతున్న మిర్చి, పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతోపాటు కాఫీ, జీడిపప్పు వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ఏటా వీటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, అమెరికా, చైనా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.

చదవండి: AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే..

71 దేశాలకు అరకు కాఫీ ఎగుమతులు 
విశాఖ మన్యంలో పండించే అరకు కాఫీకి ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో రాష్ట్రం నుంచి 1.49 కోట్ల కిలోల కాఫీ ఎగుమతి అయ్యింది. సుమారు 71 దేశాలకు మన రాష్ట్రం నుంచి ఏడు నెలల్లో రూ.659.62 కోట్ల విలువైన కాఫీ ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి రూ. 2,202.22 కోట్ల విలువైన 9.7 కోట్ల కిలోల పొగాకు కూడా వివిధ దేశాలకు ఎగుమతి అయ్యింది.

విదేశాల్లో మంచి డిమాండ్‌
రాష్ట్రంలో సాగయ్యే కొన్ని పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. పొగాకు బోర్డు, సుగంధద్రవ్యాల బోర్డు, జీడిపప్పు ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ వంటి వాటితో చర్చలు జరిపి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో జీడిపప్పు ఎగుమతులు రూ.3 కోట్లుగా ఉన్నాయి. వీటిని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
–  జీఎస్‌ రావు, జాయింట్‌ డైరెక్టర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top