బిగిస్తున్న ‘ఎన్‌ఓసీ’ ఉచ్చు

Expedites Probe Into Karnataka Fake NOCs Case - Sakshi

కర్ణాటక నకిలీ ఎన్‌ఓసీల కేసులో విచారణ వేగవంతం

ఇటీవల బెంగళూరు పోలీసుల ఎదుట హాజరైన అధికారులు

నకిలీ ఎన్‌ఓసీలతో కార్లు రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారుల్లో వణుకు

డబ్బులకోసం గడ్డి తిన్నారు.. కాసులు కనిపించగానే కళ్లుమూసుకుని సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. కర్ణాటక నుంచి నకిలీ ఎన్‌ఓసీలు తెచ్చి కార్లు విక్రయించిన కేసులో విచారణ ముమ్మరం కావడంతో.. కొందరు ఆర్టీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  

సాక్షి, అనంతపురం: కర్ణాటక వాహనాలకు నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసిన కార్ల కుంభకోణం కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొన్న కొంతమంది రిమాండ్‌కు వెళ్లి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ కేసు ఆర్టీఏ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. నకిలీ ఎన్‌ఓసీలతో వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేసిన ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న అధికారుల్లో కలవరం మొదలైంది.  

అధికారుల సహకారంతోనే.. 
గతేడాది సెప్టెంబర్‌లో రవాణాశాఖలో అతి పెద్ద కుంభకోణం వెలుగుచూసింది. నాగాలాండ్‌లో బీఎస్‌–3 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బీఎస్‌–4గా రిజిస్ట్రేషన్‌ చేసిన కుంభకోణాన్ని అధికారులు బయటపెట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. సెప్టెంబర్‌లోనే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు కర్ణాటక వాహనాలను కొనుగోలు చేసి నకిలీ ఎన్‌ఓసీలను సృష్టించడం.. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేయించి వాటిని ఎక్కువ మొత్తానికి అమాయకులకు అంటగట్టిన ముఠా ఆగడాలు బయటపడ్డాయి. అయితే వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులే కాకుండా.. కొందరు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ముందునుంచీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

రంగంలోకి కర్ణాటక పోలీసులు  
నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించి కార్లను రిజిస్ట్రేషన్‌ చేసిన కేసును కర్ణాటక పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ ఎన్‌ఓసీలతో జిల్లాకు వచ్చిన వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై చర్యలకు సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఫైల్స్‌ను అప్రూవల్‌ చేసిన ఆర్టీఓ కార్యాలయ క్లర్క్, ఏఓలపై సస్పెన్షన్‌ వేటు పడింది. త్వరలో మరికొంతమంది అధికారులపై వేటు పడనున్నట్లు తేలింది. దాదాపు 80 వాహనాల వరకూ నకిలీ ఎన్‌ఓసీలతో అక్రమంగా రిజస్ట్రేషన్‌ అయినట్లు గుర్తించిన పోలీసులు.. వాటికి రిజిస్ట్రేషన్‌ చేసిన బాధ్యులెవరన్నది కూడా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమంది ఆర్టీఏ అధికారులు బెంగళూరు పోలీసుల విచారణకు హాజరై వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే మరికొందరిపై వేటు పడే అవకాశముండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top