ఏపీ ఫైబర్‌నెట్‌ విస్తరణ | Expansion of AP Fibernet | Sakshi
Sakshi News home page

ఏపీ ఫైబర్‌నెట్‌ విస్తరణ

Jan 25 2021 3:50 AM | Updated on Jan 25 2021 4:32 AM

Expansion of AP Fibernet - Sakshi

సాక్షి, అమరావతి:  ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే మూడేళ్లలో ఫైబర్‌నెట్‌ సేవలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏటా కనీసం 20 లక్షల మంది కొత్త చందాదారులను ఏపీ ఫైబర్‌ నెట్‌ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా మూడేళ్లలో కనెక్షన్ల సంఖ్యను 60–70 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం.మధుసూదన్‌ రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం ఎపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చందాదారుల సంఖ్య 9.5 లక్షలు. చందాదారులను పెంచుకోవడం ద్వారా వార్షిక ఆదాయం రూ.336 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ పే సర్వీసుల ద్వారా ప్రతి నెలా రూ.28 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, కొత్త కనెక్షన్ల సంఖ్య 70 లక్షలకు చేరుకుంటే నెలవారీ ఆదాయం రూ.230 కోట్లకు చేరుతుందని అంచనా. ఇదే సమయంలో ప్రభుత్వ, ఇతర కార్పొరేట్‌ కనెక్షన్ల నెలవారీ ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. 

మరిన్ని గ్రామాలకు విస్తరణ 
ప్రస్తుతం ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు 2,816 గ్రామాల్లో ఉన్నాయి. త్వరలో 11,274 గ్రామాలకు సేవలను విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంటర్నెట్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ స్థాయికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో దానికి తగ్గట్టుగా ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. మండల స్థాయి వరకు ఫైబర్‌ కనెక్షన్‌ను విద్యుత్‌ స్తంభాల ద్వారా తీసుకువెళ్లి.. అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు భూగర్భ కేబుల్‌ ద్వారా తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ప్రస్తుత మార్కెట్‌ సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్‌ టీవీ, టెలిఫోన్‌ (ట్రిపుల్‌ ప్లే సర్వీసు) సేవలను అందిస్తుండటంతో గ్రామీణ స్థాయి నుంచి కొత్త కనెక్షన్లకు డిమాండ్‌ బాగుందని, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు మధుసూదన్‌ రెడ్డి పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement