పక్కాగా పరిహారం 

Estimates of kharif crop loss - Sakshi

కొలిక్కి వచ్చిన ఖరీఫ్‌ పంట నష్టం అంచనాలు 

7 జిల్లాల్లో 21 రకాల పంటలపై కరువు ప్రభావం 

14.91 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం 

5.59 లక్షల ఎకరాల్లో పత్తి.. 3.93 లక్షల ఎకరాల్లో వేరుశనగ 

2.41 లక్షల ఎకరాల్లో కంది.. లక్ష ఎకరాల చొప్పున ఆముదం, మొక్కజొన్న పంటలకు నష్టం 

డిసెంబర్‌ నెలాఖరులోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేందుకు కసరత్తు 

సాక్షి, అమరావతి: కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు కొలిక్కి వచ్చాయి. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తరువాత డిసెంబర్‌ 1న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. డిసెంబర్‌ నెలాఖరులోగా పంట నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రుతుపవనాలు మొహం చాటేయడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి.

ఈ ప్రభావం రాయలసీమ జిల్లాల్లో కొంతమేర చూపించింది. ఖరీఫ్‌లో 574.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 487.2 మిల్లీమీటర్లు నమోదైంది. 7 జిల్లాలో 21 నుంచి 35 శాతం మధ్య లోటు వర్షపాతం నమోదైంది. వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 85.97 లక్షల ఎకరాలు కాగా.. వర్షాభావ పరిస్థితుల వల్ల 64.35 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఉద్యాన పంటల సాధారణ విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా.. 28.94 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 

103 మండలాల గుర్తింపు 
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు నిర్వహణ మాన్యువల్‌ ప్రకారం మండలాన్ని యూనిట్‌గా తీసుకొని 4 సూచికల ఆధారంగా మూడు దశల్లో పరిశీలించడంతో పాటు  క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కరువు మండలాలను గుర్తించారు. 80 మండలాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉందని.. 23 మండలాల్లో స్వల్పంగా ఉందని అధికారులు గుర్తించారు. మొత్తంగా 7 జిల్లాల పరిధిలో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.

కరువు ప్రభావిత మండలాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దాదాపు నెల రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంట నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయ పంటల వారీగా నష్టం అంచనాలు కొలిక్కిరాగా.. ఉద్యాన పంటల నష్టం అంచనాలు నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానున్నాయి.  

పత్తి, వేరుశనగ పంటలకే నష్టం 
వ్యవసాయ పంటలకు వాటిల్లిన నష్టం పరిశీలిస్తే.. 7 జిల్లాల పరిధిలో 7.06 లక్షల రైతులకు చెందిన 14.91 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. వర్షాధారం కింద సాగయ్యే ప్రాంతాల్లో 14.17 లక్షల ఎకరాలు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 74 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాల్లో 6.92 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఆ తర్వాత అనంతపురంలో 4.66 లక్షల ఎకరాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం చూపినట్టు గుర్తించారు.

పంటల వారీగా చూస్తే అత్యధికంగా 5.59 లక్షల ఎకరాల్లో పత్తి, 3.93 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.41 లక్షల ఎకరాల్లో కంది, లక్ష ఎకరాల చొప్పున ఆముదం, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా, 43 వేల ఎక ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. వీటిని ఆధారంగా చేసుకుని ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల మేరకు నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రాథమిక అంచనాల మేరకు కరువు సాయం కోసం ఇప్పటికే కేంద్రానికి నివేదిక కూడా సమర్పించారు. 

నెలాఖరులోగా పంపిణీ
పంట నష్టం జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయింది. తుది జాబితాలను డిసెంబర్‌ 1న ప్రచురిస్తాం. అర్హులకు డిసెంబర్‌ నెలాఖరులోగా పంట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) జమ చేసేలా కసరత్తు చేపట్టాం.  – చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top