
రెవెన్యూ రికార్డుల్లో తప్పుల తడకలు
నిరుపేదలకు ఎకరాలకు ఎకరాలు ఉన్నట్టు నమోదు
సంక్షేమ పథకాలు వర్తించక అవస్థలు
తప్పులు సరిదిద్దేందుకు అధికారుల మీనమేషాలు
రాష్ట్రవ్యాప్తంగా లెక్కలేనన్ని తప్పులు
ఆ భూములైనా తమకు స్వాధీనం చేయాలని బాధితుల ఆవేదన
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖ చేస్తున్న తప్పులు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. భూ వివాదాల కంటే భూమి రికార్డుల్లో తప్పుగా నమోదవుతున్న వివరాల వల్లే ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ తప్పులు సరిదిద్దకపోవడం, సరిదిద్దే యత్నం చేసినా ఉన్నతాధికారుల లాగిన్లలో మారకపోవడంతో అవి అలాగే కొనసాగుతున్నాయి. ఫలితంగా పేదలు సంక్షేమ పథకాలు అందక అల్లాడుతున్నారు.
ఇవిగో నిదర్శనాలు
కాకినాడ జిల్లా కరప మండలం వేళంగికి చెందిన రాయుడు గిరిజకు ఎక్కడా భూమి లేదు. కానీ ఆమెకు యండమూరులోని 509/2, 505/1 సర్వే నెంబర్లలో 11.3 సెంట్ల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. ఈమె పేరుపై భూమి ఉందని రికార్డవడంతో ఇటీవల తల్లికి వందనం పథకం వర్తింపజేయలేదు. ఈ విషయాన్ని వీఆర్వోకు చెప్పినా, కలెక్టరేట్‌కు వెళ్లి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.
తణుకు మండలం మందపాకకు చెందిన రాజేశ్వరికి ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కంకణంపాడు అగ్రహారంలోని సర్వే నంబర్ 273లో 27 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఆమె నివాసం ఉన్న చోటకు, భూమి ఉందని చూపిన గ్రామానికి సంబంధమే లేదు. ఈమెకు ఇద్దరు పిల్లలు. తల్లికి వందనం పథకం వర్తింపజేయలేదు. అధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదు.
జేసీ లాగిన్ నుంచి సరిచేయాలంట..!
తప్పులను సరిదిద్దాలంటే జేసీ లాగిన్ నుంచి సరిచేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో తమకు పథకాలన్నా వర్తింపజేయాలి.. లేదా ఆ భూములన్నా స్వా«దీనం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్లు, ఎల్‌పీఎం నెంబర్లు, అనుభవదార్ల పేర్లు, విస్తీర్ణాలు, హద్దులు, కొలతలు, భూమి స్వభావాలు వంటి అనేక విషయాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తప్పులు లెక్కలేనన్ని జరిగాయి. ఈ తప్పులపై తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాజధానిలో సీసీఎల్‌ఏ కార్యాలయంలోనూ కుప్పలుతెప్పలుగా అర్జీలు పేరుకుపోతున్నాయి. అయినా వీటి గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలోనూ భూములకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేసినట్లు ప్రకటించారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం సమస్యలు అలాగే కొనసాగుతుండడం గమనార్హం.