సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 28 జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు విసిగిపోయారు. ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. కలిసొచ్చే సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తాం. ఉద్యమ కార్యాచరణకు అందరూ కలిసిరావాలి అని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇప్పటివరకు ఆ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి భారమెలా అవుతారు?. రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు.ఆర్టీసీ ప్రైవేటీకరణపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు.


