మూడు రోజుల్లోనే ప్రక్రియ పూర్తవ్వాలంటూ ఆదేశాలు
చివరి నిమిషంలో సీనియారిటీ లిస్ట్ విడుదల
ఆ వెంటనే తప్పులున్నాయని రద్దు
తమకు ‘జీరో సర్వీస్’ అన్యాయమంటూ విలీన అధ్యాపకుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ఉద్యోగుల బదిలీలను గందరగోళంగా మార్చేశారు. జీవో ఇచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఆదేశించడంతోపాటు సీనియారిటీ పాయింట్లతో కూడిన జాబితాను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ఇచ్చి... పొరపాట్లు ఉన్నాయని వెంటనే రద్దు చేశారు. అంతటితో ఆగకుండా ఆఘమేఘాలపై ఒక్కరోజులో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని వీడియో కాన్ఫరెన్సులో అధికారులు చెప్పడంతో లెక్చరర్లు మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, లైబ్రేరియన్లు, పీడీల బదిలీల కోసం ఈ నెల 2న ఉన్నత విద్య కార్యదర్శి జీవో నం.134 విడుదల చేశారు. జీవోకు అనుగుణంగా ఉన్నత విద్య కమిషనర్ మూడో తేదీన బదిలీలపై మార్గదర్శకాలు ఇచ్చారు. అయితే, అదేరోజు దరఖాస్తులు తీసుకుని, 4న మొత్తం బదిలీలు పూర్తి చేయాలని చెప్పడంతో ఉద్యోగులు విస్మయం చెందారు. ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇంత వేగంగా ఒక్కరోజులో బదిలీలు చేపట్టింది లేదని వారంతా వాపోతున్నారు.
సీనియారిటీలో తప్పులున్నాయని రద్దు
షెడ్యూల్ ప్రకారం లెక్చరర్లు బదిలీ కోసం ఈ నెల 3వ తేదీ సాయంత్రానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం నాలుగో తేదీన బదిలీలు పూర్తి చేయాలి. అందుకు అనుగుణంగా మొదట ముందుగా అటానమస్ కాలేజీలో అధ్యాపకుల ట్రాన్స్‌ఫర్ల కోసం మంగళగిరి కమిషనరేట్‌లో 4న ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఫలితాలు ప్రకటించకుండానే నాన్ అటానమస్ కళాశాలలకు బదిలీలను ఆదివారం పూర్తి చేయాలని నిర్ణయించారు.
అభ్యర్థులందరినీ కౌన్సెలింగ్ కళాశాలలకు హాజరు కావాలని గ్రూపులో మెసేజ్ పెట్టారు. అయితే, కొందరు లెక్చరర్ల సర్వీస్ పాయింట్లు సరిగా లేవంటూ బదిలీ కౌన్సెలింగ్ రద్దు చేసి కొత్త ఫార్మెట్‌లో పాయింట్లు పంపించాలని కమిషనరేట్ అధికారులు హడావిడిగా ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు పంపించారు. తమకు కావాల్సిన లెక్చరర్ల సర్వీస్ పాయింట్లు తక్కువగా ఉన్నాయన్న కారణంతోనే ప్రక్రియను రద్దు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుడ్డిగా సర్వీస్ పాయింట్ల నమోదు
ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ప్రభుత్వంలో విలీనమవడంతో వాటిల్లోని డిగ్రీ లెక్చరర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. అయితే, చాలాకాలంగా వారికి ప్రభుత్వం సర్వీస్ రూల్స్ రూపొందించలేదు. నెలరోజుల క్రితం సర్వీస్ రూల్స్ ఇచ్చినా వాటిపై విలీన ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో రెగ్యులర్ ఉద్యోగులు, విలీన ఉద్యోగుల మధ్య కొంత ప్రతిష్టంభన కొనసాగుతోంది.
విలీన ఉద్యోగులకు వారు ప్రభుత్వంలో చేరిన తేదీ నుంచే సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేశారు. కానీ వీటిని పట్టించుకోకుండా వారు పనిచేస్తున్న ప్రభుత్వ కాలేజీలు మాత్రం ఎయిడెడ్‌లో చేరిన నాటి నుంచి పాయింట్లను పరిగణనలోకి తీసుకుని గుడ్డిగా కమిషనరేట్‌కు పంపడంతో విలీన ఉద్యోగులు.. రెగ్యులర్ వారికంటే సీనియర్లుగా మారారు. దాంతో అభ్యంతరాలు రావడంతో బదిలీలకు బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది.
విలీన అధ్యాపకుల ఆవేదన
విలీన కళాశాలల అధ్యాపకుల సర్వీస్ నిబంధనలను తుంగలోకి తొక్కి తమకు అన్యాయం చేస్తున్నారని ఎయిడెడ్ విలీన అధ్యాపకులు వాపోతున్నారు. తమకు 2000 సంవత్సరంలో సర్వీసులో చేరినా 2021 నుంచి మాత్రమే లెక్కలోకి తీసుకోవడం అన్యాయమంటున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన అధ్యాపకులకు మేలు చేసేలా పాయింట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో స్టేషన్ సీనియారిటీ ప్రకారం బదిలీలు ఉండేవని, ఇప్పుడు కొత్తగా సర్వీస్ పాయింట్స్ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో పనిచేసే వారికి ఎక్కువ పాయింట్లు వచ్చేలా చేసేందుకే ఈ విధానం తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు.
2000 సంవత్సరం నుంచి యూజీసీ స్కేల్స్ తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమంటున్నారు. కాగా, విలీన అధ్యాపకుల్లో 350 మంది వరకూ ప్రభుత్వంలోనే ఉంటామని, తిరిగి ఎయిడెడ్‌కు వెళ్లేది లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిని తిరిగి ఎలాగైనా ఎయిడెడ్ కాలేజీలకు పంపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అయితే సోమవారం కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలోగా ఈ 350 మంది మినహా మిగిలిన వారందరిని బదిలీచేసి, ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కమిషనరేట్ ప్రయతి్నస్తోంది. ఈ క్రమంలో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న అధ్యాపకులు అందరినీ ఆదివారం అర్ధరాత్రి వరకూ కౌన్సిలింగ్ కేంద్రాల్లోనే ఉంచింది. వెబ్‌సైట్ సాంకేతిక కారణాలతో అర్ధరాత్రి వరకూ ఈ పక్రియ కొనసాగింది.


