
వినియోగదారుల్ని అడ్డంగా దోచేస్తున్న విద్యుత్ సంస్థలు
డిస్కమ్ వద్ద జనం డబ్బులున్నా రూ.1,065.76 కోట్లు వసూలు
క్యారీయింగ్ కాస్ట్ మరో రూ.65 కోట్లు ఉన్నా అదనపు షాక్
2024–25 ట్రూ అప్ నివేదికతో వెలుగులోకి
విద్యుత్తు వినియోగదారులపై ఏడాదిలో ఏకంగా రూ.19 వేల కోట్లకుపైగా భారం
సాక్షి, అమరావతి: వినియోగించిన విద్యుత్‌కు బిల్లులు వసూలు చేయడం పరిపాటి. కానీ చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త విధానాన్ని తెచ్చింది. వాడని కరెంట్‌కు కూడా బిల్లులు బాదుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి తీసుకోకుండా, కమిషన్‌కు కనీసం చెప్పకుండా ఏడాదిగా జనం జేబులకు చిల్లు పెడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024–25కి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) ప్రతిపాదనల ‘సాక్షి’గా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.
బహిరంగ మార్కెట్‌లో భారీ రేటుకు..
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా స్వల్పకాలిక విద్యుత్ ఒప్పందాల ద్వారా ఏడాదిలోనే రూ.3,500 కోట్లకుపైగా వెచ్చించడం గమనార్హం. యూనిట్ ఏకంగా రూ.6.78 చొప్పున బయట నుంచి కొన్నది. ఇలా కొన్న విద్యుత్‌కు వినియోగదారుల నుంచి ఎఫ్‌పీపీసీఏ చార్జీల రూపంలో అదనంగా రూ.2,376.94 కోట్లు వసూలు చేయాలని డిస్కమ్‌లు లెక్కగట్టాయి. యూనిట్‌కు రూ.0.40 చొప్పున ఇప్పటికే వసూళ్లు ప్రారంభించాయి.
డిస్కమ్‌ల వద్ద ఇప్పటికే జనం డబ్బులున్నా..
ప్రతి నెలా బిల్లుల్లో అదనంగా చార్జీలు వేసి ఈ ఏడాది మార్చి వరకు రూ.2,787.19 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేశారు. అంటే నిర్దేశించిన దానికంటే రూ.410.25 కోట్లు అదనంగా వసూలు చేశారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) రూ.1,065.76 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఈ డిస్కమ్ వద్ద 2024 ఏప్రిల్ నాటికి రూ.161.04 కోట్ల మేర వినియోగదారుల డబ్బులున్నాయి.
క్యారీయింగ్ కాస్ట్ (ఆదాయం) మరో రూ.65.47 కోట్లు నిల్వ ఉంది. అందువల్ల ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఈ డిస్కంకు లేదు. అయినా అకారణంగా జనం నెత్తిన భారం వేశారు. మొత్తంగా ప్రజల సొమ్ము రూ.1,292.27 కోట్లు ఈ డిస్కమ్ వద్ద ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) రూ.349.91 కోట్లు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఎస్పీడీసీఎల్) రూ.492.77 కోట్లు చొప్పున మొత్తం రూ.842.17 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదించాయి.
అంటే దాదాపు రూ.3,629 కోట్ల మేర భారాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మోపుతోంది. ఈ లెక్కన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.19 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపినట్లైంది!
గత ప్రభుత్వ ఆదాతో తగ్గిన భారం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంస్కరణలు, వినూత్న విధానాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్స్) నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.4,434.50 కోట్ల మేర నిర్వహణ ఖర్చులను ఆదా చేసింది. 2019–20 నుంచి 2023–24 వరకూ ఏపీఈపీడీసీఎల్ రూ.1,974.75 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ 2020–21 నుంచి 2023–24 వరకూ రూ.1,400 కోట్లు ఖర్చులు మిగిల్చాయి.
ఇక 2019–20 నుంచి 2023–24 మధ్య ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. గత ప్రభుత్వంలో విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్‌సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 247.35 కోట్లు మేర ఆదా అయింది. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రజలపై రూ.4,434.5 కోట్ల మేర భారం తగ్గింది.