బాబు కళ్లతో చూశారా రామోజీ?

Eenadu Ramoji Rao Fake News On RBK Services - Sakshi

ఆర్బీకేల సేవలను దేశమంతా ప్రశంసిస్తుంటే ‘ఈనాడు’ విష ప్రచారం 

గత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి మరిచిపోయారా? 

రోజుల తరబడి విత్తనాల కోసం పడిగాపులు.. స్పృహ తప్పడాలు 

నకిలీ విత్తనాలు, ఎరువులతో నిలువునా మునిగే రైతులు 

ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చాకే కదా! 

ఈ వాస్తవాలు మరిచి దుర్మార్గపు రాతలు బాబు కోసం కాదా? 

విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా ఆర్బీకేలు 

నేడు సీజన్‌కు ముందుగానే పంపిణీ 

ఏ విధంగానూ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాగా పని చేస్తున్నారని ఎవరూ చెప్పకూడదు.. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాల వారెవరూ ప్రశంసించకూడదు.. ప్రభుత్వ సేవలు భేష్‌.. అని ఎవరైనా అన్నారంటే చాలు ఈనాడు రామోజీరావుకు పూనకం వస్తుంది. తన ఆత్మీయుడు చంద్రబాబు ఎప్పుడైతే సీఎం కుర్చీ నుంచి దిగిపోయారో అప్పటి నుంచి ఈ జాడ్యం మొదలైంది. రోజూ పనిగట్టుకుని ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రుడు ఈరోజు చక్కగా ఉన్నాడని చూపిస్తే.. వేలును చూశాడట ఓ మూర్ఖుడు.. అన్నట్లుంది రామోజీ తీరు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల గురించి దేశమంతా చర్చించుకుంటున్న ఈవేళ రామోజీకి కడుపు మండిపోతోంది.

తమ బాబుకు దక్కని ఈ ఖ్యాతి మరెవరికీ దక్కరాదంటూ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు నిస్సిగ్గుగా తెగించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏమిటో మీకు తెలియదా రామోజీ? విత్తనాల కోసం రైతులు ఒక రోజు ముందుగానే వెళ్లి క్యూ లో నిలుచునే పరిస్థితి మరచిపోయారా? ఓసారి లైబ్రరీలోకి వెళ్లి నాటి పత్రికలు తిరగేయండి.. వాస్తవం మీ కళ్లకే కనిపిస్తుంది. అవునులే.. ఇప్పటికే బుద్ధి మందగించిన మీకు కంటి చూపు కూడా తగ్గిపోయి ఉంటుంది కదా! మీ సహాయకుడు ఎవరినైనా వెంటబెట్టుకుని వెళ్లి.. అతనితో చదివించి వినండి. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ఏర్పడటమనేదే ఒక చరిత్ర. సొంత భవనంలోనో.. అద్దె భవనంలోనో అవన్నీ కొనసాగుతుండటం మరో చరిత్ర. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను అనుసంధానం చేయడం ఇంకో చరిత్ర. రామోజీ.. ఇవన్నీ మీరు స్వయంగా చూసి, నిర్ధారించుకోవడానికి రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్తారో మీ ఇష్టం. ఈ సాహసం మీ వల్ల అవుతుందా రామోజీ? 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఏర్పాటైన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకే అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి. ఆర్బీకే సాంకేతికత కోసం దేశ, విదేశాలు పోటీ పడుతుంటే  ఓర్వలేని ‘ఈనాడు’.. ‘అద్దెకు దిక్కులేని ఆర్బీకేలు.. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దొరకని దుస్థితి’ అంటూ శుక్రవారం ఓ తప్పుడు కథనాన్ని వండివార్చింది. గతంలో అదును దాటక ముందు విత్తనాల కోసం, విత్తుకున్న తర్వాత ఎరువుల కోసం సన్న, చిన్నకారు రైతులు పడరాని పాట్లు పడేవారు.

ఎండనక, వాననక, పగలనకా, రేయనకా నిద్రాహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడితే కాసిన్ని విత్తన గింజలు కూడా దక్కేవి కావు. ప్రైవేటు డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుల మందులను కొంటే తప్ప ఎరువులు దొరకడం గగనంగా ఉండేది. ఎండలు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి ఏటా పదుల సంఖ్యలో రైతులు మృత్యువాత పడిన సందర్భాలు కోకొల్లలు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులతో ఆశించిన దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. ఈ వాస్తవాలన్నింటినీ మరిచి ఈనాడు ప్రస్తావించిన అంశాల్లో నిజానిజాలు ఇలా ఉన్నాయి. 

ఆరోపణ : జాడలేని విత్తనాలు 
వాస్తవం : సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిటకు అందిస్తున్నారు. సాగు వేళ అన్ని కంపెనీలకు చెందిన పురుగుల మందులను సైతం  అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్బీకేల్లోని కియోస్క్‌ల్లో బుక్‌ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఇలా ఈ మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్‌ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు.

2023–24లో రూ.222 కోట్ల విలువైన రాయితీ విత్తనాలను పంపిణీ చేయాలని ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులు 1.90 లక్షల క్వింటాళ్ల  విత్తనాల కోసం నమోదు చేసుకున్నారు. ఏపీ సీడ్స్‌ ఆర్బీకేల్లో 1.94 లక్షల క్వింటాళ్ల  విత్తనాలను అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 100 శాతం పచ్చిరొట్ట విత్తనాలు (99 వేల క్వింటాళ్లు) 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు, రాయలసీమ జిల్లాల్లో 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన విత్తనాల కోసం ఆర్బీకేల్లో జోరుగా రిజిస్ట్రేషన్లు సైతం జరుగుతున్నాయి.  

ఆరోపణ : అరకొరగా ఎరువులు  
వాస్తవం : ఆర్బీకేలతో పాటు సొసైటీలు, ప్రైవేట్‌ వ్యాపారుల ద్వారా కూడా పంట కాలానికి అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. 2023–24లో 10.50 లక్షల టన్నుల ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆర్బీకేల్లో 54,525 టన్నులు, సొసైటీల్లో 20,789 టన్నులు, ఏపీ మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో 69 వేల టన్నులు నిల్వ చేశారు. 3,979 సచివాలయ గోదాములను అగ్రి ఇన్‌పుట్‌ స్టోరేజీ పాయింట్‌లుగా గుర్తించి గ్రామ స్థాయిలో ఎరువుల నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గతంలో మండల, బ్లాక్‌ స్థాయిలో విత్తన పంపిణీ జరిగేది. ఎమ్మార్పీకి మించి అమ్మేవారు. పైగా మండల, జిల్లా కేంద్రాల నుంచి  తరలించు కోవడానికి రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. నేడు ఎమ్మార్పీకే తమ ఇంటి ముంగిటే అందిస్తున్నారు. బ్యాగ్‌పై రూ.20 మేర రవాణా ఆదా అవుతుంది. ఈ విధంగా 3 ఏళ్లలో రూ.35 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. సర్టిఫై చేసిన ఎరువుల పంపిణీ వల్ల నకిలీ ఎరు­వులు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పూర్తిగా చెక్‌ పడింది.

మరోవైపు ఈ మూడేళ్లలో 1,50,822 మంది రైతు­లకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశారు. వచ్చే సీజన్‌ కోసం సర్టిపై చేసిన సస్య రక్షణ మందులు, సూక్ష్మ పోషకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విత్తనాల కోసం ఎక్కడా క్యూలైన్‌ అనేదే కన్పించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే ఆందోళన లేదు. నకిలీల ఊసే లేదు. 

ఆరోపణ : ఆర్బీకేల అద్దెలకు దిక్కులేదు.. 
వాస్తవం : రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ భవనాల కొరత కారణంగా 3,830 ఆర్బీకేలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి అద్దె రూపంలో మూడేళ్లలో ప్రభుత్వం రూ.51.09 కోట్లు విడుదల చేసింది. 2023–24లో ఆర్బీకేలతోపాటు గోదాముల అద్దెల నిమిత్తం యాజమాన్యాలకు బకాయిలు లేకుండా ప్రతి 3 నెలలకోసారి చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. 

ఆరోపణ : అధికార పార్టీ వారికే యంత్ర పరికరాలు 
వాస్తవం : సన్న, చిన్న కారు రైతులకు గ్రామ స్థాయిలో వారికి కావాల్సిన యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మరో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలను శుక్రవారం సీఎం ప్రారంభించారు.

ఈ కేంద్రాల్లో 40 శాతం సబ్సిడీపై రూ. 1052.16 కోట్ల విలువైన 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 36,153 ఇతర వ్యవసాయ పనిముట్లు సమకూర్చారు. గతంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు రైతు రథాలు పంపిణీ చేసేవారు. పైగా ఎమ్మార్పీ కంటే కనీసం 10–30 శాతం అధికంగా కోట్‌ చేసి.. ఆ మేరకు జేబులు నింపుకునే వారు. ప్రస్తుతం  నచ్చిన కంపెనీల నుంచి  నేరుగా కొనుగోలు చేసే బాధ్యతను రైతు గ్రూపులకే అప్పగించారు.
 
ఆరోపణ : కియోస్క్‌లు పని చేయడం లేదు 

వాస్తవం : తొలి విడతలో 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లు ఏర్పాటు చేయగా, ఇటీవల మరో 1,294 ఆర్బీకేల్లో కొత్తగా సరఫరా చేశారు.  సమస్యల పరిష్కారం కోసం డాష్‌ బోర్డు ఏర్పాటు చేశారు. కియోస్క్‌లకు ఇంటర్నెట్‌ కోసం రూ.19.34 కోట్లు విడు దల చేశారు. బ్యాంకింగ్‌ సేవలను గ్రామ స్థాయిలో అందించేందుకు వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న 9,277 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌(బీసీ)లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. ఇండియన్‌ పోస్టల్‌ బ్యాంక్‌ సహకారంతో మిగిలిన ఆర్బీకేల్లోనూ వీరి నియామకానికి చర్యలు చేపట్టారు.  

ఆరోపణ : అనుబంధ రంగాలకు అరకొర సేవలు 
వాస్తవం : ఆర్బీకేల ద్వారా మూడేళ్లలో 2 కోట్ల సేవలు అందించారు. పశుసంవర్ధక శాఖ ఆర్బీకేల ద్వారా పశుపోషకులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోంది. ఇప్పటి వరకు రూ.106.48 కోట్ల విలువైన 67,395 మెట్రిక్‌ టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా 60 శాతం సబ్సిడీ (రూ.63.89 కోట్లు)పై పంపిణీ చేశారు. రూ.49.66 కోట్ల విలువైన 5397.95 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాస విత్తనాలను 75 శాతం సబ్సిడీ (రూ. 37.24 కోట్లు)పై అందించారు. రూ.115.18 కోట్ల విలువైన 3,907 గడ్డి కత్తిరించే యంత్రాలను 40 శాతం సబ్సిడీ (రూ.46.07 కోట్లు) పై పంపిణీ చేశారు.

వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి జగనన్న పాల వెల్లువ పథకం కింద ఇప్పటి వరకు 3.72 లక్షల పశువులు, జగనన్న జీవ క్రాంతి పథకం కింద 1.34 లక్షల మంది గొర్రెలు, మేకలు పంపిణీ చేశారు. పశు పోషకులకు 45,652 పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేశారు. పశువిజ్ఞాన బడుల ద్వారా 14,83,643 మందికి మెళకువలపై అవగాహన కల్పించారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగును ఈ ఫిష్‌ బుకింగ్‌ చేస్తూ గిట్టుబాటు ధర, బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఆక్వా రైతులు మత్స్యకారులకు సర్టిఫై చేసిన చేపలు, రొయ్యల ఫీడ్, చేపల సీడ్‌ పంపిణీ చేస్తున్నారు.

ఫిషింగ్‌ బోట్స్‌ నమోదు, లైసెన్సులు జారీ చేస్తున్నారు. అప్సడా చట్టం ద్వారా ఆక్వాసాగు, ఆక్వా వ్యాపార కార్యకలాపాలు, ఫిష్‌ ఫీడ్, రొయ్యల సీడ్‌ల కోసం లైసెన్సు/ఎండార్స్‌మెంట్లు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 36,779 లైసెన్సులు జారీ చేశారు. 16,489 నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. వైఎస్సార్‌ మత్స్యసాగు బడి ద్వారా 17,945 మందికి అవగాహన కల్పించారు.

అదేరీతిలో ఉద్యాన, పట్టు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. ఈ–క్రాప్, ఈ–ఫిష్‌ నమోదుతోపాటు పంట నష్ట పరిహారం, ఇతర పథకాలు అందిస్తున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్బీకేల స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో పీఎం సమృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. యూఎన్‌ చాంపియన్‌ అవార్డుకు మన రాష్ట్రం నామినేట్‌ అయింది. సాంకేతికత కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఇథియోపియా ఒప్పందం కుదుర్చుకుంది.   

ఆరోపణ : సిబ్బంది లేకుండా సేవలా? 
వాస్తవం : రెండు విడతల్లో 6,246 వ్యవసాయ, 4,655 పశు సంవర్ధక, 2,356 ఉద్యాన, 731 మత్స్య, 377 పట్టు సహాయకులు పని చేస్తున్నారు. వీరే కాకుండా అనుభవజ్ఞులైన బహుళార్ద, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గోపాల మిత్రలను నియమించి రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్‌ను అనుసంధానం చేశారు. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top