
సాక్షి, తిరుమల: తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్‌చల్ చేశారు. .కర్నూలుకి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. రోడ్డుపై నానా హంగామా చేశారు. ఫుల్‌గా మద్యం తాగి భక్తులను ఇబ్బందులకు గురిచేశారు.
తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు. డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌లో 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్ ఘటన స్థలం నుంచి పరారీ కాగా, పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్‌కు సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్‌కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.
మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.
