చిట్టి పొట్టి ఆవులు.. చలాకీ గోవులు | Development of miniature cows for rearing in houses and apartments | Sakshi
Sakshi News home page

చిట్టి పొట్టి ఆవులు.. చలాకీ గోవులు

Published Mon, Feb 20 2023 4:56 AM | Last Updated on Mon, Feb 20 2023 7:39 AM

Development of miniature cows for rearing in houses and apartments - Sakshi

పుంగనూరు జాతిలోనే అత్యంత బుల్లి ఆవు ఇది. 12 అంగుళాల (అడుగు) ఎత్తు.. 36 అంగుళాల (3 అడుగుల) పొడవుండే ఈ ఆవులను ‘మైక్రో మినీయేచర్‌ పుంగనూరు’గా పిలుస్తున్నారు. మనుషులకు ఇట్టే మచ్చికయ్యే ఈ ఆవులు ఇళ్లు, అపార్ట్‌మెంట్లు అనే తేడా లేకుండా.. ఏ వాతావరణంలో అయినా.. ఎక్కడైనా పెరుగుతాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. నట్టింట్లో గంతులేస్తూ.. చిన్నపిల్లల మాదిరిగా మారాం చేస్తూ.. యజమానుల చుట్టూనే ఇవి తిరుగుతున్నాయి. గతంలో పెరటికి మాత్రమే పరిమితమైన ఈ బుజ్జి గోవులు ఇప్పుడు బెడ్‌ రూముల్లోనూ సందడి చేస్తున్నాయి. ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని పంచుతున్నాయి.  

సాక్షి, అమరావతి: గోవులు.. మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వ అఖండ భారతదేశంలో 302 జాతుల ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 32కు పరిమితమైంది. పొట్టి జాతి ఆవుల విషయానికి వస్తే మల్నాడ్‌ గిడ్డ (కర్ణాటక), వేచూరు (కేరళ), మన్యం (ఆంధ్రప్రదేశ్‌), బోనీ (బెంగాల్‌), మినీ మౌస్‌ (నేపాల్‌) జాతులు ఉన్నాయి. మన్యం–ఒంగోలు బ్రీడ్స్‌ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి 3నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. పుంగనూరుతో సహా కనుమరుగైన పొట్టి జాతి గోవులను సంరక్షించాలన్న తపనతో కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ నాడీపతి వైద్యుడు పెన్మత్స కృష్ణంరాజు సాగించిన పరిశోధనల ఫలితంగా అతి చిన్నవైన ‘మైక్రో మినీయేచర్‌ పుంగనూర్‌’ ఆవులు పురుడు పోసుకున్నాయి.

ఏ వాతావరణంలోనైనా పెరిగేలా..
మట్టి నేలలతోపాటు గచ్చు, ఫామ్‌హౌజ్, టైల్స్, మార్బుల్స్‌తో కూడిన ఇళ్లు, అపార్టుమెంట్స్‌లో సైతం పెంచకునేలా 4 రకాలుగా వీటిని అభివృద్ధి చేశారు. అడుగు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు, 40 నుంచి 70 కిలోల బరువుతో రోజుకు లీటర్‌ నుంచి రెండు లీటర్ల వరకు పాలిచ్చేలా వీటిని అభివృద్ధి చేశారు. వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. 

పశుగ్రాసంతోపాటు ఎలాంటి ఆహారన్నయినా జీర్ణించుకోగలుగుతాయి. పెద్దలకే కాకుండా పిల్లలకు సైతం కూడా ఇట్టే మచ్చికవుతాయి. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మందికి వీటిని అందించారు.  మైక్రో మినీయేచర్‌ సహా వివిధ జాతులతో అభివృద్ధి చేసిన 500 వరకు పొట్టి జాతుల ఆవులు నాడీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. నిత్యం గో ప్రేమికులు ఈ గోశాలను సందర్శిస్తూ చెంగుచెంగున గంతులేసే పొట్టి గోవుల మధ్య పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ మురిసిపోతున్నారు.
నాడీపతి గోశాలలో సందడి చేస్తున్న పొట్టి ఆవులు 

వాటి అల్లరి చెప్పనలవి కాదు
ఏడాది వయసున్న 2 అడుగుల ఎత్తు గల రెండు మినీయేచర్‌ పుంగనూరు ఆవులను తీసుకెళ్లి మా అపార్ట్‌మెంట్‌ 3వ అంతస్తులోని ప్లాట్‌లో పెంచుకుంటున్నాం. ఎలాంటి ఆహారం పెట్టినా తింటున్నాయి. మాతో పాటే వాకింగ్‌ చేస్తాయి. కారులో కూడా మా వెంట తీసుకెళ్తాం. ఇంట్లో అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కుటుంబంలో భాగమైపోయాయి. చిన్నప్పటి నుంచి పెరట్లో ఆవులను పెంచుకోవాలన్న 
మా కోరికను ఇలా తీర్చుకుంటున్నాం.
– వల్లివాటి శ్రీనివాసబాబు, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్‌

వాటి మధ్య ఉంటే టెన్షన్‌ హుష్‌కాకి
మా ఇంట్లో రెండు మినీయేచర్‌ గిత్తలను పెంచుకుంటున్నాం. అవి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. వాటిని చూస్తే చాలు మాలో ఉన్న టెన్షన్స్‌ చేత్తో తీసేసినట్టు పోతాయి. మాతోనే  ఉంటున్నాయి. మాతో పాటే తింటున్నాయి. వాటికి ప్రత్యేకంగా బెడ్స్‌ కూడా ఏర్పాటు చేశాం. మాతో పాటే పడుకుంటున్నాయి.
– పి.సూర్యనారాయణరాజు, పత్తేపురం, పశ్చిమ గోదావరి జిల్లా

లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టాం
రెండు మినీయేచ­ర్‌ పుంగనూరు ఆవుల్ని తెచ్చుకు­న్నాం. లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టుకున్నాం. పేరు పెట్టి పిలవగానే చెంగున వచ్చి ఒడిలో వాలిపోతాయి. వాటిని చంటిపాపల్లా చూసుకుంటున్నాం. అవి లేకుండా ఉండలేకపోతున్నాం. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్తున్నాం. వాటితో గడుపుతుంటే మనసు ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది    
– అమటం పద్మావతి, విశాఖ

ప్రపంచంలో ఎక్కడా లేవు
1,632 ఆవులను బ్రీడింగ్‌ చేయడం ద్వారా వీటిని ఒక అడుగు ఎత్తు వరకు తీసుకురాగలిగాం. మినియేచర్‌ పుంగనూరు ఆవుల ఎత్తు 2 అడుగుల్లోపు కాగా, మైక్రో మినీయేచర్‌ పుంగనూరు ఆవుల ఎత్తు అడుగులోపే. ప్రపంచంలో ఇవే అత్యంత పొట్టి జాతి ఆవులు. వీటికి పేటెంట్‌ హక్కు కోసం దరఖాస్తు చేశా. వచ్చే  పదేళ్లలో కనీసం లక్ష ఆవులను పునరుత్పత్తి చేసి అడిగిన ప్రతీ ఒక్కరికి  అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. 
– డాక్టర్‌ పెన్మత్స కృష్ణంరాజు, పరిశోధకుడు, నాడీపతి గోశాల వ్యవస్థాపకుడు

14 ఏళ్ల పరిశోధనల ఫలితం
నాడీపతిలో పీహెచ్‌డీ చేసిన కృష్ణంరాజు వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన ప్రాచీన భారతీయ సనాతన వైద్యవిధానంతోపాటు అంతరించిపోతున్న అరుదైన పొట్టిజాతి గోవుల పునరుత్పత్తిపై 14 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నాడీపతి వైద్య విధానంపై శిక్షణ ఇస్తూ సర్జరీలు, సైడ్‌ఎఫెక్ట్‌ లేని 100 రకాల థెరఫీల ద్వారా దీర్ఘకాలిక రోగాలకు వైద్యం అందిస్తున్నారు.

మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతి అవులను సృష్టించాలన్న సంకల్పంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో నాడీపతి గోశాల నెలకొల్పారు. తొలుత పుంగనూరు–బోనీ జాతులను క్రాసింగ్‌ చేసి 3 అడుగుల ఎత్తు గల పొట్టి ఆవులను అభివృద్ధి చేశారు. వాటిని దేశంలో ఇతర పొట్టి జాతి బ్రీడ్‌లతో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో మరిన్ని పొట్టి జాతి ఆవులను అభివృద్ధి చేశారు. చివరగా పుంగనూరుతో బోనీ, మల్నాడ్‌ గిడ్డ, మినీ మౌస్, వేచూరు ఆవులతో క్రాసింగ్‌ చేసి మైక్రో మినేయేచర్‌ పుంగనూరు ఆవును సృష్టించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement