వైఎస్ జగన్ నిర్ణయంతో మా కల సాకారం
రాజమహేంద్రవరానికి మణిహారం
మా అమ్మాయి తన్మయి విద్యాభ్యాసమంతా రాజమహేంద్రవరంలోనే సాగింది. అమ్మాయికి డాక్టర్ అవ్వాలన్నది చిన్నప్పటి నుంచి కోరిక. తల్లిదండ్రులుగా అందుకు ఊతమివ్వడం మా కర్తవ్యం. ఆ దిశగా ఇంటర్ వరకు రాజమహేంద్రవరంలోనే విద్యాభ్యాసం సాగింది. ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ సీటు కూడా ఇక్కడే వస్తే బావుంటుందని ఆశ పడ్డాం. అయితే మొదటి విడత కౌన్సెలింగ్‌లో మచిలీపట్నం వైద్య కళాశాలలో సీటు వచ్చింది. రెండో విడత ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో లభించింది.
ఇక రాజమహేంద్రవరంలో రాదని ఆశలు వదులుకున్నాం. అ తరుణంతో ఊహించని విధంగా రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో సీటు ఖాయం అయింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు ఒక వైద్య కళాశాల తీసుకురావాలనే సంకల్పం మా అమ్మాయికి కలిసి వచ్చింది. తద్వారా మా కల నిజమైంది. ఇప్పుడు రోజూ ఇంటి నుంచే కళాశాలకు వెళ్లొస్తోంది.
ఇప్పుడు ఈ వైద్య కళాశాలలో 450 మంది మెడికోలు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వైఎస్ జగన్ నగర నడిబొడ్డున ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి ఎంతో మంది పేద, మధ్యతరగతి పిల్లల కలలను నిజం చేశారు. హ్యాపీ బర్త్ డే టూ జగనన్నా.. – సుధాకర్, మేరీభాను సుజాత దంపతులు
ఆ నిర్ణయం నాకు వరమైంది
రెండు విడతల కౌన్సెలింగ్‌లో నాకు దూర ప్రాంతంలో సీటు రావడంతో సొంతూళ్లో సీటు వస్తుందనే ఆశలు వదిలేసుకున్నా. అయితే అప్పటి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం నాకు కలిసి వచ్చింది. జిల్లాకొక మెడికల్ కాలేజీ నిర్ణయంతో మూడో విడతలో నాకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్నాను.
నేను చిన్నతనంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాను. దీంతో మా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ దృష్ట్యా నేను చంటి పిల్లల వైద్య నిపుణురాలు కావాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఈ ప్రయాణంలో తొలి దశ ఎంబీబీఎస్ సీటు ఇంటికి చేరువలోనే రావడానికి కారణమైన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. – తన్మయి


