‘పవర్‌’ లాబీయింగ్‌! | Decision to Increase Retirement Age in Power Sector Corporations | Sakshi
Sakshi News home page

‘పవర్‌’ లాబీయింగ్‌!

Jun 5 2026 5:19 AM | Updated on Jun 5 2026 5:28 AM

Decision to Increase Retirement Age in Power Sector Corporations

విద్యుత్‌ సౌధ

విద్యుత్‌ సంస్థల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం 

సీఎం వద్ద మూడు ప్రతిపాదనలు ఉంచిన అధికారులు, ప్రజాప్రతినిధుల కమిటీ 

ఇదే అదనుగా లాబీయింగ్‌ చేస్తామంటూ రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు 

62 ఏళ్ల వరకూ పదవీ విరమణ వయసు పెంపు కోరుతున్న ఉద్యోగుల నుంచి వసూళ్లు 

కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ ఆరోపణలు ఎదుర్కొన్న విశ్రాంత ఉద్యోగి కీలక పాత్ర 

ఒక్క విద్యుత్‌ శాఖ నుంచే దాదాపు రూ.5 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, కేబినెట్‌లో కూడా దీనికి అంగీకారం తెలిపిందంటూ గురువారం ఉద్యోగుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఎల్లో మీడియా వార్తలు చక్కర్లు కొట్టాయి. నిజానికి కేబినెట్‌ అజెండాలోనే అసలు ఈ అంశం లేదు. అయినా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉందని, అయితే అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా తాము ‘లాబీయింగ్‌’ చేస్తామని చెబుతూ కొందరు వ్యక్తులు ఉద్యోగులను దోచుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూ.కోట్లు వసూలు కూడా చేసేసినట్టు తెలిసింది.   

మూడు ప్రతిపాదనలు  
విద్యుత్‌ సంస్థల్లో 1990 నుంచి 1998 వరకూ నియామకాలు ఎక్కువగా జరిగాయి. ప్రస్తుతం అన్నిటిలో కలిపి 34,582 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. వీరిలో 80 శాతం 1990 నుంచి 1998 మధ్యకాలంలో నియమితులైన వారే ఉన్నారు. వీరంతా 2026 నుంచి 2030 మధ్య పదవీ విరమణ చేయనున్నారు. వీరందరికీ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాల్సి వస్తుంది. వారు వేలల్లో ఉన్నారు. వారందరికీ బెనిఫిట్స్‌ ఇవ్వడానికి  భయపడిన కూటమి ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఈ రెండేళ్లకు కూడా బెనిఫిట్స్‌ ఇవ్వకుండా మరో రెండేళ్లు పెంచాలని కూడా ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే విద్యుత్‌ సంస్థ(ట్రాన్స్‌కో, జెన్‌కో, నెడ్‌క్యాప్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌)ల్లో 60 ఏళ్లకు ఇటీవల పదవీ విరమణ చేసిన వారు, త్వరలో చేయనున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది.

దీంతో పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం విద్యుత్‌ సంస్థల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. దానిలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. వారు సీఎం వద్ద మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి 2022 నుంచి పదవీ విరమణ వయసు పెంపును వర్తింపజేయడం. రెండోది కూటమి అధికారంలోకి వచి్చన 2024 నుంచి ఈ నిబంధనను అమలుల్లోకి తెస్తున్నట్లు చెప్పడం. మూడోది.. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఎప్పుడు ఆదేశాలిస్తే.. అప్పటి నుంచి అర్హులకు ఇవ్వడం. ఈ మూడు ప్రతిపాదనల్లో 2022 నుంచి అమలు చేయాలన్న దానిపైనే ఉద్యోగులు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. 

కావాలనుకునే వారి నుంచి వసూళ్లు  
విద్యుత్‌ సంస్థల్లో కారి్మకులు, ఇంజినీర్లు, అకౌంట్స్, మానవ వనరుల శాఖ అనే నాలుగు ప్రధాన విభాగాలున్నాయి. వీటిలో కార్మికులు, ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. 55 ఏళ్లు నుంచి 60 ఏళ్లు వరకూ విద్యుత్‌ స్తంభాలు ఎక్కడం వంటి పనులు వీరు చేయలేరు. అదీగాక ప్రస్తుతం ఉద్యోగుల కొరత వల్ల ఒక్కొక్కరూ నాలుగైదు విభాగాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. కింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపించి, ఇటీవల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. పైగా పదవీ విరమణ బెనిఫిట్స్‌పై వచ్చే వడ్డీ కంటే వయసు పెంచి ఇచ్చే జీతం తక్కువ. దీంతో పదవీ విరమణ వయసును పెంచడం చాలా మంది ఉద్యోగులకు ఇష్టం లేదు. కానీ మరికొంత మంది మాత్రం పదవీ విరమణ వయసు పెంచాలని కోరుకుంటున్నారు.

తద్వారా తమకు పదోన్నతులు వస్తాయని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ పెరుగుతాయని వారు ఆశపడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు (ఎస్‌ఈ), డివిజన్‌ ఇంజనీర్లు(డీఈ) ఉన్నారు. వీరిని టార్గెట్‌ చేసిన ఓ విశ్రాంత ఉద్యోగి తనకున్న పలుకుబడి, తనపైన ఉన్న మరో ముఖ్య నాయకుడితో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. అతను చెప్పిన మాటలు, అతని వెనుక ఉన్న వ్యక్తులను చూసి పని అవుతుందని భావిస్తున్న ఉద్యోగులు ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి అతను అడిగినంత ఇస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక్క విద్యుత్‌ శాఖ నుంచే రూ.5 కోట్ల వరకూ వసూలు చేశారని అంటున్నారు. కాగా, ఇదే వ్యక్తిపై గతంలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ వివాదంలో అనేక ఆరోపణలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement