ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ సేఫ్‌ కియోస్క్‌లు.. ఇక ఫోన్లు సురక్షితం

Cyber safe kiosks to remove dangerous viruses and malware on phones - Sakshi

సైబర్, ఆర్థిక నేరాల అడ్డుకట్టకు రాష్ట్ర పోలీసుల కార్యాచరణ

మన ఫోన్లలో ప్రమాదకర వైరస్, మాల్‌వేర్‌లను తొలగించడానికి సైబర్‌ సేఫ్‌ కియోస్క్‌లు

రాష్ట్రంలో మొత్తం 50 కియోస్క్‌ల ఏర్పాటుకు నిర్ణయం

ఇప్పటికే కొనుగోలు.. అన్ని జిల్లాలకు తరలింపు

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఓ వ్యాపారవేత్త మొబైల్‌ ఫోన్‌కు ఏదో లింక్‌ వచ్చింది.. ఆయన దాన్ని క్లిక్‌ చేశారు. అందులో ఏమీ లేదు కానీ ఆయనకు తెలియకుండానే మొబైల్‌ ఫోన్‌లో మాల్‌వేర్‌ చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆన్‌లైన్‌ బ్యాంక్‌ ఖాతాల నుంచి ఎవరో నగదు స్వాహా చేసేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆ వ్యాపారవేత్త లబోదిబోమన్నారు. ఇలా మొబైల్‌ ఫోన్‌ను సాధనంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో సైబర్‌ కవచ్‌ పేరిట 50 సైబర్‌ సేఫ్‌ కియోస్క్‌ల ఏర్పాటుకు నిర్ణయించింది. 

కేసుల కంటే కట్టడే ముఖ్యం
మన దైనందిన జీవితంలో మొబైల్‌ ఫోన్‌ ఓ అత్యవసర వస్తువుగా మారింది. సంభాషణలు, సందేశాల నుంచి బ్యాంకింగ్, ఈమెయిల్స్, ఇతర లావాదేవీల వరకు అన్నిటికీ మొబైల్‌ ఫోన్‌ను వాడాల్సిందే. ఇదే సమయంలో వేధింపురాయుళ్లు, సైబర్, ఆర్థిక నేరగాళ్ల మోసాలకు సాధనంగా కూడా మారుతోంది. వివిధ వైరస్‌లు, మాల్‌వేర్, తదితరాల నుంచి మన ఫోన్లకు ముప్పు పొంచి ఉంది. దేశ, విదేశాల నుంచి వివిధ లింక్‌లు, మెయిళ్లు, వీడియోలు, ప్రకటనలు.. ఇలా పలు రకాలుగా వైరస్‌లను సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌ ఫోన్లలోకి పంపుతున్నారు.

అనంతరం సైబర్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోయాక కేసులు నమోదు చేయడం కంటే ముందుగానే మొబైల్‌ ఫోన్‌ వాడకందారులకు అవగాహన కల్పించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. తమ మొబైల్‌ ఫోన్‌లో ప్రమాదకర వైరస్, మాల్‌వేర్‌ ఉన్నాయో, లేదో కూడా 90 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ వాడకందారులు గుర్తించలేరు. కాబట్టి వారి ఫోన్లలో ఇవి ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి ‘సైబర్‌ సేఫ్‌ కియోస్క్‌లు’ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో వీటికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

సైబర్‌ సేఫ్‌ కియోస్క్‌ల్లో సేవలన్నీ ఉచితం..
త్వరలో రాష్ట్రంలో 50 సైబర్‌ సేఫ్‌ కియోస్క్‌లను పోలీసు శాఖ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే గుజరాత్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ నుంచి వీటిని కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపింది. 18 జిల్లా, అర్బన్‌ పోలీసు ప్రధాన కార్యాలయాల్లో, 18 దిశ పోలీస్‌స్టేషన్లలో, ప్రముఖ బస్‌స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మరో 14 కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. ఆ కియోస్క్‌ల డాష్‌బోర్డ్‌లను ఎలా నిర్వహించాలో కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి కియోస్క్‌కు అడ్మిన్‌గా నియమిస్తారు. ఎవరికైనా తమ ఫోన్‌లో ప్రమాదకర వైరస్‌ చేరిందని సందేహం కలిగితే ఆ కియోస్క్‌కు తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు. కియోస్క్‌ల్లో ఆ స్మార్ట్‌ ఫోన్లను స్కాన్‌ చేసి పరీక్షిస్తారు. వాటిలో ప్రమాదకర వైరస్‌లు, మాల్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు ఉంటే తొలగిస్తారు. ఈ సేవలన్నీ కూడా ఉచితంగానే అందిస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top