గెల.. గలగల!

Cultivation of profitable palm oil - Sakshi

లాభాలు కురిపిస్తున్న పామాయిల్‌ సాగు

తాజాగా టన్ను గెల ధర రూ.21,890

నాలుగు నెలల్లో టన్నుకి రూ.4వేలు పైనే పెరుగుదల

ఎకరాకు పది టన్నుల దిగుబడి.. రూ.2.20 లక్షల ఆదాయం

పొగాకుకు ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున సాగు

రైతన్నలో కుటుంబాల్లో ఆనందం

దేవరపల్లి, రంగంపేట (తూర్పు గోదావరి): మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్న పామాయిల్‌ రైతన్నలకు కాసులు కురిపిస్తోంది. రెండేళ్లలో పామాయిల్‌ గెలల ధర గరిష్ట స్థాయికి చేరడంతో సాగుదారులు మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21890 చొప్పున పలికి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. జనవరిలో రూ.17,500 ఉన్న ధర మార్చిలో రూ.19,300కి చేరుకోగా తాజాగా మరింత పెరిగింది.  

యుద్ధం.. దిగుమతులు ఆగడంతో
ఉక్రెయిన్‌ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పామాయిల్‌ దిగుమతులకు ఆటంకం తలెత్తడంతో మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. 2019లో టన్ను గెలల ధర రూ.ఆరు వేలు మాత్రమే ఉండగా 2020లో రూ.8,000 పలికింది. 2021లో రూ.10,000కి చేరుకుంది. ఈనెల 4వ తేదీన ఉద్యాన శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌.ఎస్‌ శ్రీధర్‌ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతులకు ఏప్రిల్‌ నుంచి టన్ను పామాయిల్‌ గెలలకు రూ.21,890 చొప్పున చెల్లించాలి. ఈ మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రుచి సోయా పామాయిల్‌ కంపెనీతో పాటు మిగిలిన 12 కంపెనీలు కూడా ఇదే ధర చెల్లించాల్సి ఉంది. 

ఉభయ గోదావరిలో భారీగా సాగు
కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాల పరిధిలో 55 వేల ఎకరాల్లో పామాయిల్‌ పంట సాగులో ఉంది. అనపర్తి, పెద్దాపురం, గండేపల్లిలోనూ సాగు చేపట్టారు. గత మూడు నెలల వ్యవధిలో ఆరు వేల ఎకరాల్లో కొత్తగా నాట్లు వేయడంతో ఉభయ గోదావరిలో సాగు విస్తీర్ణం 81 వేలకు పెరిగిపోయింది. జూన్, జూలైలో మరో ఐదు వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. 

పొగాకుకు ప్రత్యామ్నాయంగా
పొగాకు పంట గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పామాయిల్‌ సాగు చేసి లాభాలు పొందుతున్నారు. పొగాకు భూముల్లో రెండేళ్లుగా రైతులు పామాయిల్‌ తోటలు వేస్తున్నారు. దాదాపు 8,000 ఎకరాల్లో ఈ తోటలు వేసినట్లు సమాచారం. పెట్టుబడి తక్కువ, ఆదాయం బాగుండటంతో వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు.

ఎకరాకు రూ.2.20 లక్షల ఆదాయం
పామాయిల్‌ ఎకరాకు 10 టన్నుల గెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21,890 ఉండడంతో రూ.2.20 లక్షలు వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. అన్ని పంటల కంటే ఆయిల్‌ పామ్‌కు మంచి ధర లభిస్తోందని, మెట్ట రైతులను పామాయిల్‌ ఆదుకుందని ఆనందంగా చెబుతున్నారు.

రైతులను ఆదుకుంది..
ఈ ఏడాది పొగాకు మినహా అన్ని పంటలకు మార్కెట్లో డిమాండ్‌ ఉంది. పామాయిల్‌ పంట రైతులను ఆదుకుంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు అవుతుంది. సగటున ఎకరాకు రూ.1.70 లక్షల నికర ఆదాయం వస్తుంది. 
– నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, రాష్ట్ర ఆయిల్‌పామ్‌ బోర్డు, యర్నగూడెం

ఊహించని ధర 
ఇంత ధర ఊహించలేదు. పామాయిల్‌ తోటలు రైతులను ఆదుకుంటున్నాయి. 30 ఎకరాల్లో సాగు చేస్తున్నా. 300 టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున రూ.1.50 లక్షలు మిగులుతుంది. మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశ«ం ఉంది.  
    – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి

లాభాల పంట 
ఆయిల్‌ పామ్‌ లాభాల పంట. రెండేళ్ల నుంచి మంచి ఆదాయం వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం లభిస్తోంది. డ్రిప్‌ ద్వారా నీటితడులు, పశువుల ఎరువు వాడడం వల్ల దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 10 నుంచి 11 టన్నుల దిగుబడి వస్తోంది. గత రెండు సంవత్సరాలు దిగుబడులు, రేటు ఆశాజనకంగా లేక లాభాలు తగ్గాయి. 11 ఎకరాల్లో తోట ఉంది. 112 టన్నులు దిగుబడి వచ్చింది. 
– పల్లి వెంకటరత్నారెడ్డి, రైతు, త్యాజంపూడి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top