Andhra Pradesh: జూలై 15 నాటికి కరోనా తగ్గుముఖం!

Covid 19: AP SRM University Predicts Cases Will Decrease by July 15 - Sakshi

ఈ నెలాఖరు నాటికి 5 వేలలోపే కేసులు 

జూలై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువే  

మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌తో అంచనా వేసిన ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు 

సాక్షి, అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో  రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (డీమ్డ్‌ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరటనిచ్చే కబురు చెప్పారు. జూలై 15 నాటికి రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం తయారు చేసిన ఈ నివేదికను యూనివర్సిటీ ప్రో వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.నారాయణరావు మంగళవారం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు ఈమెయిల్‌ ద్వారా పంపారు.  

నివేదిక వివరాలివీ.. 
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రో వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.నారాయణరావు చొరవతో వర్సిటీ ప్రొఫెసర్‌ సౌమ్యజ్యోతి బిస్వాస్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థులు అన్వేష్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, సాయికృష్ణ, సుహాసిరెడ్డి కోవిడ్‌ వ్యాప్తి ముగింపు కాలాన్ని అంచనా వేస్తూ శాస్త్రీయంగా నివేదికను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్‌ఐఆర్‌ (సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్‌ అండ్‌ రికవరీ మోడల్‌)సాయంతో ర్యాండమ్‌ ఫారెస్ట్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ డేటాను తయారు చేశారు.

కరోనా వ్యాప్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డేటాను ఎస్‌ఎస్‌ఐఆర్‌ డేటాతో అనుసంధానం చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిపై అంచనా గణాంకాలు స్పష్టమవుతున్నాయి. ఇదే పద్ధతిని పాటించిన ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తాము తయారు చేసిన డేటాను ఉపయోగించి విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్‌ 14 నాటికి 1,000 జూలై నాటికి 500 కేసులు నమోదయ్యే అవకాశముందని, జూలై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్‌ఆర్‌ఎం గణాంకాలు తెలియజేస్తున్నాయి.  

చదవండి: Corona Care: ఆ టూత్‌ బ్రష్‌ వాడకండి!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top