
కేసులు విచారిస్తుండగానే పరిస్థితిని వివరించిన అధికారులు
వీలైనంత త్వరగా తిరిగి వెళ్లాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి
మధ్యాహ్నం 2 గంటల కల్లా హైకోర్టు ఖాళీ
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో భారీ వరదల కారణంగా సోమవారం హైకోర్టు కార్యకలాపాలు స్తంభించాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది హైకోర్టుకు చేరుకున్న గంటకే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటకల్లా హైకోర్టు ఖాళీగా మారింది. భారీ వరదల నేపథ్యంలో సెలవు ప్రకటించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం ఆదివారమే హైకోర్టు సీజేకి లేఖ రాశారు. అయితే సెలవు ఇచ్చేందుకు ఆసక్తి చూపని హైకోర్టు వర్గాలు..వాదనల కోసం ప్రత్యక్షంగా హాజరు కాలేని న్యాయవాదుల కేసులు కొట్టివేయబోమని, వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయబోమని హామీ ఇచ్చాయి. కాగా, న్యాయమూర్తులు కొద్దిపాటి ఆలస్యంతో విధులు చేపట్టారు.
వాయిదాల ప్రక్రియను ముగించిన అనంతరం కేసుల విచారణను ప్రారంభించారు. ఓవైపు కేసుల విచారణ జరుగుతుండగానే రిజిష్ట్రార్లు కోర్టు హాళ్లలోకి వచ్చి కరకట్ట వద్ద పరిస్థితి ఆందోళనకరంగా, ప్రమాదకరంగా ఉందని న్యాయమూర్తులకు నివేదించారు. వీలైనంత త్వరగా హైకోర్టు విడిచి వెళ్లడం మేలని తెలిపారు. దీంతో న్యాయమూర్తులు తమ ముందున్న కేసుల విచారణను మంగళవారానికి వాయిదా వేసి చాంబర్లలోకి వెళ్లిపోయారు. అనంతరం వాహనాలలో బయలుదేరారు. సీఎం నివాసం సహా కరకట్ట కింద ఉన్న ప్రముఖుల ఇళ్లన్నీ నీటి ముంపు బారిన పడటాన్ని న్యాయమూర్తులు ప్రత్యక్షంగా చూశారు.
క్షేత్రస్థాయి పరిస్థితులు, కరకట్ట ప్రమాదకర స్థితి గురించి హైకోర్టు వర్గాల నుంచి సీజే సమాచారం తెప్పించుకున్న అనంతరం మంగళ, బుధవారాలు కేసుల విచారణను ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. న్యాయమూర్తులందరూ వారి ఇళ్ల నుంచే కేసులను విచారిస్తారు. హైకోర్టు న్యాయవాదులు నిర్వహించే ‘టీం స్వేచ్ఛ’ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు సహాయ చర్యలు చేపట్టారు. న్యాయవాదులు పదిరి రవితేజ, దామోదర్, సురేష్, సాయిరామ్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు సాగాయి.
రాష్ట్ర సచివాలయం ఖాళీ
వరద భయంతో సోమవారం మధ్యాహ్నం వరకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, అధికారులు ప్రాణభయంతో గడిపారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతోనే.. బతుకుజీవుడా అనుకుంటూ సచివాలయ ఉద్యోగులతో పాటు అధికారులందరూ మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోయారు. కృష్ణా కరకట్ట లీకు అవ్వడంతో పాటు కొట్టుకుపోతుందనే సమాచారం వారిని ఆందోళనకు గురిచేసింది.
సీఎం, సీఎస్ నేతృత్వం వహించే సాధారణ పరిపాలన శాఖతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు ఉత్కంఠతోనే గడిపారు. కరకట్ట ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే సచివాలయానికి వరద పోటెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులు గుర్తించి ఉద్యోగులను ఇళ్లకు పంపేశారు. మధ్యాహ్నం ఉద్యోగులు 4 బస్సుల్లో కిక్కిరిసి ఇళ్లకు చేరుకున్నారు. కృష్ణా కరకట్ట పక్కనే సచివాలయం ఉన్నందున ఎప్పటికైనా వరద ముప్పు పొంచి ఉంటుందనే చర్చ అక్కడ సాగింది.