
ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్‌గా నోటిఫై చేయకపోవడమే కారణం
2014లో నోటిఫై చేయాల్సింది 2022లో నోటిఫై చేసింది
అందువల్ల 2022కి ముందు ఏసీబీ పెట్టిన కేసులు చెల్లవు
2016–2022 మధ్య కాలంలో నమోదైన కేసులకు చట్టబద్ధత లేదు
హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ తీరుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు కేసుల నుంచి తప్పించుకున్నారు. విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)ను పోలీస్‌స్టేషన్‌గా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పునరి్వభజన చట్టం కింద నోటిఫై చేయకపోవడంతో ఆ అధికారులపై ఏసీబీ నమోదు చేసిన కేసులను హైకోర్టు తాజాగా కొట్టేసింది. సీఐయూను పోలీస్‌స్టేషన్‌గా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని హైకోర్టు గుర్తుచేసింది. 2022లో నోటిఫై చేసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. 2016–2022 మధ్య కాలంలో నమోదైన కేసులకు చట్టబద్ధత లేదని తేలి్చంది. దీంతో.. అవినీతి ఆరోపణల కింద 15 మంది అధికారులపై నమోదైన కేసులను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
కేసులు కొట్టేయాలంటూ పిటిషన్లు..
ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వివిధ శాఖలకు చెందిన 15 మంది అధికారులపై 2016–19 మధ్య కాలంలో విజయవాడలోని ఏసీబీ సీఐయూ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేశారు. వీటిని కొట్టేయాలని కోరుతూ వారు 2020, 21, 23 సంవత్సరాల్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమపై కేసులు నమోదుచేసే నాటికి విజయవాడ ఏసీబీ సీఐయూని సీఆర్‌పీసీ కింద పోలీస్‌స్టేషన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదని.. అందువల్ల తమపై కేసుల నమోదు చెల్లదని ఆ అధికారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు.
నోటిఫై చేయకుండా
కేసుల నమోదు చెల్లదు..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లపై ఏసీబీ ఆరోపణలు నిరాధారమైనవని, కేసులు నమోదుచేసే నాటికి ఏసీబీ సీఐయూ పోలీసుస్టేషన్ కాదన్నారు. పోలీస్‌స్టేషన్‌గా నోటిఫై చేయకుండా కేసుల నమోదు చెల్లదని స్పష్టంచేశారు. 2003లో రాష్ట్రంలో పలు ఏసీబీ కార్యాలయాలను పోలీస్‌స్టేషన్లుగా నమోదుచేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ ఇచి్చందన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత నాటి ఏపీ ప్రభుత్వం ఏసీబీ కార్యాలయాలను పోలీస్‌స్టేషన్లుగా నోటిఫై చేయలేదని ఆయన చెప్పారు.
ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు సమాచార హక్కు చట్టం కింద ధ్రువీకరించారని రామారావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషనే ఉనికిలో లేనప్పుడు కేసుల నమోదే చెల్లదని.. అందువల్ల సోదాలు, జప్తులు, వారెంట్ల జారీ తదితరాలను కోరుతూ ఏసీబీ దాఖలు చేసే దరఖాస్తులను ఏసీబీ ప్రత్యేక కోర్టులు విచారించడానికి వీల్లేదన్నారు.
అన్నీ అన్వయించుకున్నట్లే భావించాలి : ఏజీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విభజన తరువాత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో అమలైన అన్ని చట్టాలు, సర్క్యులర్లు, మెమోలు పునరి్వభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్వయింప చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. 2003లో రాష్ట్రంలో పలు ఏసీబీ కార్యాలయాలను పోలీస్‌స్టేషన్లుగా నమోదుచేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు.
అందువల్ల రాష్ట్ర విభజన తరువాత ఆ జీఓ అమల్లో ఉన్నట్లేనన్నారు. 2022లో ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్‌గా నోటిఫై చేసినప్పటికీ అంతకుముందు కేసులు నమోదు చేసేందుకు ఏసీబీకి అధికారం ఉందన్నారు. పిటిషనర్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయని, వారిపై కేసులను కొట్టేయవద్దని ఆయన కోర్టును అభ్యరి్థంచారు.
ప్రాథమిక తప్పుని ఆ తరువాత సరిదిద్దలేరు : న్యాయమూర్తి
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ తీర్పునిస్తూ.. పిటిషనర్లపై కేసులు పెట్టిన విజయవాడ ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్‌గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఎలాంటి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. అందువల్ల నోటిఫై కాని పోలీసుస్టేషన్‌కు ఇన్‌చార్జ్ అధికారిగా పోలీసు అధికారి వ్యవహరించజాలరని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. 2022లో జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రాథమిక తప్పుని సరిచేయలేరన్నారు. ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్‌గా ప్రభుత్వం నోటిఫై చేయడానికి ముందే పిటిషనర్లపై కేసులు నమోదయ్యాయి కాబట్టి అవి చెల్లవని, వాటిని కొట్టేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.