
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మల్లాది విష్ణు. పక్కన రామకృష్ణ, జంధ్యాల శంకర్ తదితరులు
ఆర్టీసీ స్థలాన్ని లులుకు అప్పగించడం తగదు
ఈనెల 6న విజయవాడలో పౌరవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
పౌర వేదిక ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, పలు కమ్యూనిస్టు పార్టీల మద్దతు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని, విజయవాడ ఆర్టీసీ స్థలాన్ని లులు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈనెల 6న విజయవాడలో పౌర వేదిక తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు.
చంద్రబాబుకు భూదాహం..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ.. విజయవాడలో అత్యంత చారిత్రక నేపథ్యంతోపాటు రూ.400 కోట్ల విలువైన 4.15 ఎకరాల పాత బస్టాండ్ స్థలాన్ని, విశాఖపట్నంలో 13.7 ఎకరాలను బహుళజాతి సంస్థకు అçప్పగించే ప్రభుత్వ చర్యలు సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి భూదాహం పట్టుకుందని, అమరావతిలో మరోమారు భూ సమీకరణకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.
ఐక్య ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలి
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ పాలకులు ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాల పేరుతో యథేచ్ఛగా భూసంతర్పణ చేయడం ఆక్షేపణీయమన్నారు.
సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దోనేపూడి కాశీనాథ్ (సీపీఎం), నరహరశెట్టి నరసింహరావు (కాంగ్రెస్), దోనేపూడి శంకర్ (సీపీఐ), పి. ప్రసాద్ (సీపీఐ–ఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరనాథ్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్)లతోపాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండీ ప్రసాద్, జోనల్ కార్యదర్శి వైఎస్ రావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ అంజనేయులు తదితరులు మాట్లాడుతూ.. ఆర్టీసీ స్థలాన్ని అన్యాక్రాంతం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, జీఓ నెంబర్ 137ను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.