
తురకా కిషోర్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం
అసలు కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి
ఘటనలు, ఫిర్యాదులు, కేసులు, అరెస్టుల వివరాలు మా ముందుంచండి
పల్నాడు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత తురకా కిషోర్‌పై కేసుల మీద కేసులు పెడుతూ, ఒక కేసులో బెయిల్‌పై బయటకు రాగానే మరో కేసులో అరెస్ట్ చేస్తున్న పోలీసుల తీరును హైకోర్టు ప్రశ్నించింది. 2024లో ఘటన జరిగితే.. సంవత్సరం రెండునెలల తరువాత కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి ఆ వెంటనే అరెస్ట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
తురకా కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఘటనలు ఎప్పుడు జరిగాయి.. ఎప్పుడు ఫిర్యాదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్ చేశారు.. తదితర వివరాలను ఓ టేబుల్ రూపంలో తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన తురకా సురేఖ
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తురకా కిషోర్‌పై ఒకదాని వెంట మరొకటి కేసులు పెడుతూనే ఉన్నారని చెప్పారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 12 కేసులు నమోదు చేశారన్నారు. బుధవారం ఉదయం కిషోర్ గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు రాగానే రెంటచింతల పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు.
గత ఏడాది ఏప్రిల్‌లో ఘటన జరిగింది
పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. కిషోర్‌పై హత్యాయత్నం కింద మంగళవారం ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశామని చెప్పారు. అతడిని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఘటన ఎప్పుడు జరిగిందని ప్రశ్నించింది. గత ఏడాది ఏప్రిల్ 8న ఘటన జరిగిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు.
సంవత్సరం రెండునెలల తరవాత కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేశారా.. అంటూ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎప్పుడు ఘటనలు జరిగాయి.. ఎప్పుడు ఫిర్యాదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్ చేశారు.. తదితర వివరాలను టేబుల్ రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ, విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.