
హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్‌పై కూటమి సర్కార్ డబుల్ గేమ్
విజయవాడలో ఈ పాయింట్‌ను సాధించినది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఇక్కడినుంచి వెళ్లే హాజీలపై అదనపు భారాన్ని కూడా చెల్లించిన వైఎస్ జగన్
ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు లేఖ ఇచ్చిన చంద్రబాబు సర్కారు
నిరుడు పాయింట్ రద్దుతో హజీలకు ఇస్తానన్న రూ.లక్ష ఎగవేత
ఇప్పుడు హజ్ దరఖాస్తుల ప్రక్రియ చివర్లో ఎంబార్కేషన్ సాధించినట్టు సంబరాలు
విజయవాడలో అవకాశం లేక హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లేందుకు ఇప్పటికే 1,700 మంది పైగా దరఖాస్తులు
చివరి రోజున అనుమతి ఇవ్వడం వల్ల ఉపయోగమేమిటని పెదవి విరుస్తున్న హాజీలు
చివరి దశలో ఎంబార్కేషన్ వచ్చినా.. హాజీలకు డబ్బులు ఎగ్గొట్టేలా కూటమి ప్రభుత్వం పథకం
వాస్తవాలు మరుగునపరిచి ఎవరిని మభ్యపెడతారంటూ బాబు సర్కారుపై ముస్లిం సమాజం మండిపాటు
సాక్షి, అమరావతి: ముస్లిం సోదరుల పవిత్ర హజ్ యాత్రపై కూటమి ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేసేందుకు నిరుడు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. ఈ ఏడాది దాన్ని కొత్తగా సాధించినట్లు గొప్పలు చెబుతోంది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా ఏపీకి చెందిన హాజీలు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల (ఎంబార్కేషన్ పాయింట్) నుంచి వెళ్లేవారు. ఏపీ వారు గన్నవరం విమానాశ్రయం నుంచే వెళ్లేందుకు వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపారు.
కేంద్రం నుంచి హజ్–2023 యాత్రకు ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. 2023, 2024లో గన్నవరం నుంచి దాదాపు 2,495 మంది హజ్ యాత్రకు వెళ్లారు. 2023లో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై విమాన చార్జీల అదనపు భారాన్ని సైతం భరిస్తూ రూ.14.50 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే అందించింది. 2024లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ నేపథ్యంలో హజ్ యాత్రికులకు రూ.14.04 కోట్లను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక హాజీలకు చెల్లించాల్సిన రూ.9.40 కోట్లు ఇవ్వకుండా దగా చేసింది.
రూ.లక్ష ఎగ్గొట్టేందుకు ఎంబార్కేషన్ రద్దుకు ఊతం
హజ్ యాత్రికులకు ఆరి్థక సాయాన్ని పెంచి రూ.లక్ష చొప్పున అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయకుండా దగా చేశారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విజయవాడ నుంచి వెళ్లేవారికే అంటూ మెలికపెట్టారు. దీన్ని కూడా ఎగ్గొట్టేందుకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు కేంద్రానికి లేఖ ఇచ్చారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు 101 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నందున దాని రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ లేఖ ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరుఫ్ బర్మన్ నిరుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్‌సింగ్‌కు లేఖ రాశారు. ఏపీ హజ్ కమిటీ వచ్చిన వినతి మేరకు రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.
చివరి దశలో సాధించినట్టు కూటమి కొత్త డ్రామా..
హజ్–2026కు కేంద్ర హజ్ కమిటీ ఇచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూలై 31తో ముగిసింది. దీనికి ఒకరోజు ముందు అంటే జూలై 30న విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌కు కేంద్రం నుంచి అనుమతి సాధించినట్టు కూటమి నేతలు గొప్పలు చెప్పుకున్నారు. హజ్ యాత్రకు షెడ్యూల్ ప్రకటించినప్పుడే విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్‌గా ప్రకటించి ఉంటే రాష్ట్రానికి చెందినవారు విజయవాడ విమానాశ్రయం నుంచి కూడా హజ్ యాత్రకు వెళ్లడానికి అవకాశం ఉండేది.
అయితే హజ్ యాత్రకు దరఖాస్తుకు ఒక రోజు ముందు మాత్రమే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఉంటుందని ప్రకటించారు. కానీ అప్పటికే రాష్ట్రానికి చెందిన 1,700 మందికిపైగా హైదరాబాద్, బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ముందే విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్‌గా ప్రకటించి ఉంటే ఈ 1,700 మంది విజయవాడ నుంచే వెళ్లడానికి ఆస్కారం ఉండేది. ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల 1,700 మంది వ్యయప్రయాసలు, దూరాభారం భరించి హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ముస్లిం సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తారు?
కూటమి నేతలు ముస్లిం సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తారు? 2024లో హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ నిధులు మంజూరు చేసినా.. కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల ముందు హజ్ యాత్రికులకు రూ.లక్ష చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ఈసారి దరఖాస్తుకు ముందు విజయవాడ నుంచి వెళ్లేవారికే రూ.లక్ష ఇస్తామని చెబితే ఎక్కువమంది వెళ్లేవారు.
కానీ, ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేయించి ఇస్తామన్న రూ.లక్ష ఎగ్గొట్టడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు హజ్‌కు అందరూ దరఖాస్తు చేసుకున్నాక ఎంబార్కేషన్ పాయింట్‌ను పునరుద్ధరించినట్టు చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి.? పథకం ప్రకారం ముస్లింలను ఏమార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, సలహాదారు షరీఫ్ తందాన తాన అంటారా? వారికి ముస్లిం సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే హాజీలకు బకాయిలు చెల్లించడంతో పాటు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.లక్ష చొప్పున సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. –షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్
కూటమి ప్రభుత్వం ముందే ఎందుకు స్పందించలేదు?
విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీరు సరిగ్గా లేదు. వైఎస్ జగన్ సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను నిలబెట్టుకునేలా ఎందుకు కృషి చేయలేదు? కనీసం ఇప్పుడైనా హజ్ షెడ్యూల్ ప్రకటించకముందే ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుని ఉంటే విజయవాడ నుంచి వెళ్లేందుకు ఆన్‌లైన్ ఆప్షన్ పెట్టుకునే వెసులుబాటు కలిగేది.
అన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగిసే చివరి దశలో ఎంబార్కేషన్ పాయింట్ ఇస్తే ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే తప్ప హాజీలకు ఉపయోగమేమి లేదని తెలియదా? టీడీపీ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రిగా ఉన్నప్పటికీ, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అవకాశాలను ఉపయోగించుకోకుండా ఎంబార్కేషన్ పాయింట్ విషయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడడం ముస్లింలను మోసం చేయడమే. –షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్