
స్పష్టం చేసిన హైకోర్టు
గతనెలలో జారీ చేసిన సర్క్యులర్ సవరణ
సోషల్ మీడియా కేసులు, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే
ఈ నేరాల్లో పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 173(3)ను అనుసరించేలా చూడాలని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి : యాంత్రిక రిమాండ్ల విషయంలో మేస్ట్రేట్‌లకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ గత నెల 5న జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొంత మేర సవరించింది. యాంత్రికంగా రిమాండ్లు ఇస్తున్న మేజి్రస్టేట్లపై కోర్టు ధిక్కార చర్యలు కాకుండా, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజి్రస్టార్ జ్యుడీషియల్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.
కేవలం సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లే కాకుండా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే అన్ని కేసుల్లో కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పక అమలు చేసి తీరాల్సిందేనని మేజిస్ట్రేట్‌లను ఆదేశించింది.
‘ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మూడు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే, విచారణకు స్వీకరించదగ్గ నేరాల్లో పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 173(3)ను అనుసరించేలా చూడాలి. ఏడేళ్ల వరకు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ ఉత్తర్వులు వెలువరించే ముందు మేజిస్ట్రేట్‌లందరూ.. పోలీసులు అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించారా? లేదా? అన్నది పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేయాలి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఇదే విషయానికి సంబంధించి గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ను కఠినంగా అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారు’ అని తేల్చి చెప్పింది. గతంలో జారీ చేసిన సర్క్యులర్‌లో తమ ఆదేశాలను పాటించకుంటే దానిని చాలా తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్న వాక్యాన్ని తొలగించింది.
ధిక్కార చర్యలు సరికాదంటూ పిటిషన్
జూన్ 5న హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌లో తమ ఆదేశాలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తప్పవని పేర్కొనడాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది జయంతి ఎస్‌సీ శేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్క్యులర్‌లోని పదజాలం మేజి్రస్టేట్‌లను బెదిరించేలా ఉందని ఆయన అందులో పేర్కొన్నారు.
కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం కూడా సరికాదన్నారు. ఈ వ్యాజ్యంపై గత నెల 9న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైకోర్టు రిజిస్ట్రార్ గత సర్క్యులర్‌ను కొంత మేర సవరించారు.