
రాష్ట్రంలో జీఎస్‌టీ చెల్లింపుదారుల వాటా 2.8 శాతమే
జీఎస్‌డీపీలో ఏపీ జీఎస్‌టీ వాటా 4.7 శాతం
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: జీఎస్‌టీ చెల్లింపుదారుల వాటా ఆంధ్రప్రదేశ్‌లో మరీ తక్కువగా ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. పెద్దరాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో జీఎస్‌టీ చెల్లింపుదారుల వాటా తక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని నివేదిక వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో జీఎస్‌టీ చెల్లింపుదారుల సామర్థ్యం ఇంకా ఉందని అధ్యయనం సూచిస్తోందని నివేదిక తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో జీఎస్‌టీ చెల్లింపుదారులు వాటాతో పాటు జీఎస్‌డీపీలోని వాటాలను రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశంలో మొత్తం జీఎస్‌టీ చెల్లింపుదారుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 50 శాతం ఉన్నారని తేల్చింది.

దేశం మొత్తం జీఎస్‌టీ చెల్లింపుదారుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 2.8 శాతమే ఉందని స్పష్టం చేసింది. జీఎస్‌డీపీలో ఏపీ జీఎస్‌టీ చెల్లింపుదారుల వాటా 4.7 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. జీఎస్‌టీ చెల్లింపుదారుల విషయంలో కేరళ సైతం ఏపీ తరహాలోనే తక్కువ వాటాను కలిగి ఉండగా.. ఏపీతో పోలిస్తే తెలంగాణ కొంత నయమనిపిస్తోందని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జీఎస్‌డీపీలో వాటా కన్నా జీఎస్‌టీ చెల్లింపుదారుల వాటా ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.