కాలయాపనతో... మైండ్‌ గేమ్‌! | Contractors approached court for bills | Sakshi
Sakshi News home page

కాలయాపనతో... మైండ్‌ గేమ్‌!

Jul 3 2025 3:28 AM | Updated on Jul 3 2025 3:28 AM

Contractors approached court for bills

పులివెందుల కాంట్రాక్టర్లపై పగబట్టిన ప్రభుత్వ పెద్దలు

బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు  

చేసిన పనుల నాణ్యతపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు 

సానుకూల నివేదిక రావడంతో అవాక్కైన వైనం 

దీంతో టెండర్‌ ఫర్‌ వ్యాల్యూయేషన్‌పై విజిలెన్స్‌ విచారణ  

ఏడాదిగా పదే పదే కొర్రీలు

డబ్బులు ఖర్చుచేశాం.. కాంట్రాక్టు పనులు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించండి అంటూ ఓవైపు కాంట్రాక్టర్లు ఏడాదిగా వేడుకుంటున్నారు..! కానీ.. పనుల నాణ్యతపై ఒకసారి విజిలెన్స్‌ విచారణ.. తప్పేమీ లేదని అందులో నివేదిక రావడంతో టెండర్‌ వ్యాల్యూయేషన్‌ ఫర్‌ విజిలెన్స్‌ అంటూ మరోసారి.. కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంట్రాక్టర్లు చివరకు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసులు జడ్జిమెంట్‌ దశకు చేరుకున్నాయి. అయినా ఏడాదిగా కోర్టు ఉత్తర్వులు వెలువడకుండా కాలయాపన చేస్తూ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది.  

సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ పెద్దలు పులివెందులలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయాలనే ఎత్తుగడ ఎంచున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు సర్కార్‌ వేధిస్తోంది. ఎన్నడూ లేని విధంగా మానసికంగా, ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి చేసిన పనులకు బడ్జెట్‌ కేటాయించకుండా, సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న బిల్లులను క్లియర్‌ చేయకుండా నాన్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేసుల నంబర్లు అయ్యాయి. 

త్వరలో జడ్జిమెంటు ఉంటుందనుకున్న దశలో ప్రభుత్వం పనులపై తొలుత విజిలెన్స్‌ ఫర్‌ క్వాలిటీకి ఆదేశించింది. విజిలెన్స్‌ అధికారులు తీసుకున్న కోర్‌ శ్యాంపిల్స్‌ను విజయవాడకు తీసుకెళ్లి పరీక్ష చేయించారు. సహజంగా జిల్లాకేంద్రాల్లోని ల్యాబ్‌లో పరీక్ష చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఒత్తిడితో వేరేచోట చేశారు. అయితే, అన్ని శాంపిల్స్‌ (98 శాతం మెరిట్‌) పాస్‌ అయ్యాయి. నివేదికలు హైకోర్టుకు చేరితే బిల్లుల చెల్లింపులే తరువాయి అనుకున్న తరుణంలో జాప్యం కోసం కూటమి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఎంచుకుంది.

» దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తయిన పనులకు టెండర్‌ వ్యాల్యూయేషన్‌పై విజిలెన్స్‌ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సహజంగా టెండర్‌ వ్యాల్యూయేషన్‌ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఎల్‌–1 ప్రకటించక మునుపే చేపట్టాలి. ఇంజినీరింగ్‌ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎల్‌–1, ఎల్‌–2 ప్రకటిస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ చేయించి పనులు కొనసాగిస్తారు. 

అగ్రిమెంట్‌ విధి విధానాల ప్రకారం సంబంధిత పనిని పూర్తి చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్‌ సరి్టఫికెట్‌ జత చేసి ఆ పనికి బిల్లు చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అయ్యాక కూడా రాష్ట్ర ప్రభుత్వం  బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్కడ జాప్యం చేసేందుకు ఒకసారి విజిలెన్స్‌ ఫర్‌ క్వాలిటీ, ఆ ప్రక్రియ పూర్తికాగానే మళ్లీ మొదటికి వచ్చి టెండర్‌ వ్యాల్యూయేషన్‌ ఫర్‌ విజిలెన్స్‌ అంటూ మరోసారి కాలయాపన చేసే ఎత్తుగడను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారని పలువురు వాపోతున్నారు.  

» ప్రభుత్వం 15 నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసులు తీర్పు దశకు రాగా, దానిని అడ్డుకునే ప్రక్రియను చేపడుతున్నారని వాపోతున్నారు. 

» పులివెందుల పరిధిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్‌ శాఖలలో  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ప్రస్తుతం టీడీపీ వారు చేపడుతున్నారు. ఓవైపు బిల్లుల చెల్లింపునకు జాప్యం చేస్తూనే, టెండర్‌ వ్యాల్యూయేషన్‌ ఫర్‌ విజిలెన్స్, క్వాలిటీ ఫర్‌ విజిలెన్స్‌ అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు అవే పెండింగ్‌ పనులను కొనసాగించడం విశేషం.  

» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడకుండా.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందించింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిçస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రయోజనాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు కేటాయించింది. కానీ, కూటమి సర్కార్‌ పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తుండడం, హైకోర్టు ఉత్తర్వులు సైతం జాప్యం అయ్యేలా మైండ్‌గేమ్‌ ఆడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement