పోర్టుకు సర్కారు పోటు | Construction work on Ramayapatnam Port is in slow progressing | Sakshi
Sakshi News home page

పోర్టుకు సర్కారు పోటు

Mar 18 2026 5:40 AM | Updated on Mar 18 2026 5:40 AM

Construction work on Ramayapatnam Port is in slow progressing

నత్తనడకన సాగుతున్న రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు  

బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్‌ వంటి కీలక నిర్మాణ పనుల్లో అలసత్వం  

పనులు ఎప్పటికి పూర్తవుతాయో కచ్చితంగా చెప్పలేని స్థితిలో అధికారులు  

పోర్టు పనుల పూర్తిపై పదేపదే తేదీలు మారుస్తున్న ప్రభుత్వ పెద్దలు  

వైఎస్సార్‌ సీపీ హయాంలో జెట్‌ స్పీడ్‌తో 60 శాతం పనులు పూర్తి

రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టుకుంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 2024 చివరి నాటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సాగిన పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా పడకేశాయి. ఈ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. 

కీలకమైన బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్, బ్రేక్‌వాటర్‌ ఫీడర్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి కీలక పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు. దీంతో పోర్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని ప్రశ్నగా మిగిలింది. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం పోర్టు ప్రారంభంపై నెలకో తేదీ చెప్తూ కాలయాపన చేస్తున్నారు.

కందుకూరు:  ప్రకాశం జిల్లాలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతానికి మణిహారంగా.. జిల్లా అభివృద్ధికి ఊతంగా ఉపయోగపడే రామాయపట్నం పోర్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన ఈ పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టు సంస్థను తొలగించడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 

ఆ తరువాత మరో బడా కాంట్రాక్టు సంస్థకు నిర్మాణ పనులు అప్పగించారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులను కూడా నూతన కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయలేకపోయింది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బెర్తుల నిర్మాణం ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం చేయాల్సి ఉండగా వాటిలో గత ప్రభుత్వంలోనే ఒక బెర్తు నిర్మాణం పూర్తయింది. మిగిలిన మూడు బెర్తుల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. 

అలాగే భారీ ఓడలు నిలిచే విధంగా సముద్రలోతు పెంచే డ్రెజ్జింగ్‌ పనులు కూడా పూర్తి కాలేదు. సౌత్, నార్త్‌ బ్రేక్‌వాటర్‌ ఫీడర్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇక సిబ్బంది కోసం నిర్మించాల్సిన క్వార్టర్లు, కస్టమ్స్‌ రూమ్స్‌ వంటి పనులు పూర్తి కాలేదు. అలాగే చెన్నై–కోల్‌కత్తా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పోర్టు నుంచి చేపట్టిన కీలక రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 

అలాగే సమీపంలోని తెట్టు రైల్వే స్టేషన్‌ నుంచి పోర్టు వరకు రైల్వేలైన్‌ నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ఇప్పటి వరకు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇలా పోర్టు నిర్మాణంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. దీంతో అసలు పోర్టు పనులు పూర్తి చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఇదీ నిర్మాణ ప్రణాళిక... 
కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్‌ మెట్రిక్‌ టన్స్‌ పర్‌ యానమ్‌) సామర్ధ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్‌) నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా బ్రేక్‌ ఫీడర్‌ల నిర్మాణంతో పాటు, డ్రెజ్జింగ్, ఒక బల్‌్కబెర్తు నిర్మాణం, సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ విభాగాలకు చెందిన బిల్డింగ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. 

బల్‌్కబెర్త్‌ నిర్మాణం పూర్తికావడంతో రామాయపట్నం పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి మొదటి ఓడను నిలపాలని భావించారు. తరువాత ప్రభుత్వం మారడంతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పోర్టు పనుల పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఒక బెర్తు పూర్తయినా మిగిలిన మూడు బెర్తుల నిర్మాణాన్ని రెండేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయింది. ఇలా అన్ని విభాగాల పనులు దాదాపు ఏడాది కాలం పాటు నిలిచిపోయాయి. ఆ తరువాత పనులు ప్రారంభించినా అనుకున్న స్థాయి లో పనులు జరగడం లేదు. ఇదే ప్రస్తుతం రామాయపట్నం పోర్టు పాలిట పెద్ద శాపంగా మారింది.

నెలకో ప్రారంభ తేదీ... 
రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే తేదీలపై అటు మారిటైంబోర్డు అధికారులు, ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన మారిటైంబోర్డు అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి పోర్టు అందుబాటులోకి వస్తుందని ప్రకటిస్తే, ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో పోర్టు పనుల పూర్తిపై ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి చూస్తే మరో రెండు, మూడేళ్లకు కూడా పోర్టు నిర్మాణ పనులు పూర్తికావనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement