ఉత్తరాంధ్రలో అధికారుల వసతి ఏర్పాట్లకు కమిటీ

Committee for accommodation arrangements of officers in Uttarandhraa - Sakshi

రాత్రిపూట కూడా ఉండేందుకు వీలుగా బస, వసతి ప్రాంతాలను గుర్తించాలి

వీలైనంత త్వరగా నివేదికను సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాలి

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ జవహర్‌రెడ్డి

విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు

సీఎంకు సహాయంగా ఉండేలా అధికారులు బస ఏర్పాట్లు చేసుకోవాలి

సాక్షి, అమరావతి: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినందువల్ల అధికార యంత్రాంగం కూడా ఇందుకు సన్న­ద్ధమ­వుతోంది. త్వరలో ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించడంతో పా­టు అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల అమ­లు తీరును నిరంతరం సమీక్షిస్తారు. ఈ నేప­థ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల­యాన్ని విశాఖ­పట్నంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. రాత్రి పూటఆయన అక్కడే బస చేయనున్నారు. వివిధ శాఖలపై విశాఖలోనే సమీక్షలు చేసే అవకాశం ఉంది.

అందువల్ల సీనియర్‌ అధికా­రులు, జిల్లా పరిపాలన అధికారులు సీఎంకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాల్సి వస్తుంది. కొంతమంది సీనియర్‌ అధికారులను రాత్రి పూట కూడా విశాఖలో బస చేయమని కోర­వచ్చు. ఈ కారణంగా వీలైనంత త్వరగా తగిన వసతిని గుర్తించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గు­రు అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌–­హెఆర్‌ఎం) కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా తగిన వసతి గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు నివేదికను సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి పూట తగిన రవాణా, వసతి ఉండేలా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో బస చేయడానికి తగ్గ ప్రాంతాలను గుర్తించాలని పేర్కొన్నారు.  

అభివృద్ధికి అవసరం..
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ­పురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతా­రామ­రాజు, అనకాపల్లి జిల్లాలను ఉత్తరాంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, కనెక్టివిటి మొదలైన సూచి­కల్లో వెనుకబడి ఉంది. గిరిజన జనాభా అత్యధి­కంగా ఉంది. ఉత్తరాంధ్రలో నా­లు­గు జిల్లాలను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల వెనుక­బడిన ప్రాంతాల గ్రాంటు కింద కూడా ఉన్నా­యి.

ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా నీతి ఆయోగ్‌ గుర్తించింది. ఉత్తరాంధ్ర చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్‌­వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక అభివృద్ధి ప్రోత్స­హ­కాలను పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం, సమీక్షించడంతో పాటు స్థానిక అవసరాలను తెలుసుకోవడం వంటివి అధికారయంత్రాంగం చేయాల్సి ఉంటుంది.

రాత్రి పూట బస చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిప­తులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రవాణా, వసతి చూసుకోవాల్సిందిగా ఆయా శాఖలు, శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top