రాష్ట్రంలో వాణిజ్య, వంట గ్యాస్ సంక్షోభం తీవ్రతరం
బుకింగ్ చేసుకుని 10–20 రోజులైనాగృహ వినియోగదారులకు అందని గ్యాస్
వాణిజ్య సిలిండర్ల కొరతతో అల్లాడుతున్న హోటల్ వ్యాపారులు
ఫలితంగా టిఫిన్స్, కర్రీ పాయింట్లలో రేట్లు రూ.10 పెంపు
సామాన్యుడి నెల బడ్జెట్‌లో రూ.3 వేల వరకూ అదనపు భారం
ప్రభుత్వ వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాల్లో తిండి కరువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం సామాన్య గృహ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ బుకింగ్ చేసి వారాలు గడుస్తున్నా డెలివరీ చేయకపోవడంతో నిత్యం ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఓటీపీ సమస్య వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఫలితంగా గ్యాస్ లోడ్ల కోసం సామాన్యులు ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది.
మరోవైపు వాణిజ్య గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా హోటళ్లు, చిరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో 14.2 కిలోల సిలిండర్‌ను రూ.2వేలు, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ను రూ.4 వేలు పెట్టి అధికరేట్లకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఈ ఆర్థిక భారాన్ని పూడ్చుకునేందుకు వ్యాపారులు టిఫిన్లు, కర్రీలపై రూ.10 చొప్పున పెంచి విక్రయిస్తున్నారు. దీంతో రోజువారీ కూలి పనులు చేసుకునే బడుగు జీవులకు నెలకొచ్చే స్వల్ప ఆదాయంలో రూ.2వేల నుంచి రూ.3 వేల వరకూ చిల్లుపడుతోంది. వెరసి సామాన్య ప్రజలు ఇంటిలోవంట చేసుకోలేక.. బయట అధిక రేట్లకు కొని, తినలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
మూడు వారాలకుపైనే బ్యాక్ లాగ్స్
రాష్ట్రంలో గ్యాస్ బుకింగ్స్ బ్యాక్ లాగ్స్ మూడు వారాలకు పైనే ఉంటున్నాయి. అంటే, బుకింగ్ చేసుకున్న 10 నుంచి 21 రోజుల తర్వాత కూడా డెలివరీ అవుతుందన్న గ్యారెంటీ లేదు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే గ్యాస్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 4 వేల టన్నుల గ్యాస్ అవసరం కాగా మూడున్నర రోజులకు మించి నిల్వలు ఉండట్లేదు.
రోజువారీ బుకింగ్‌లతో పోలిస్తే డెలివరీలు పెంచామని ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు సైతం గ్యాస్ సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విద్యార్థులు, వృద్ధులు, చిన్నారులకు పెట్టే ఆహారంలో మెనూలు కుదించడంతో కడుపునిండా తిండి దొరకట్లేదు. ఇక సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారుల పరిస్థితి దయనీయంగా మారింది.
బ్లాక్ మార్కెట్ దందా
దేశవ్యాప్తంగా గ్యాస్ డెలివరీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఓటీపీ విధానం ఏపీలో ఘోరంగా విఫలమైంది. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి రోజులు గడిచినా ఓటీపీలు రాకపోవడంతో గ్యాస్ కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక స్థానిక అధికారులు కొందరు దగ్గరుండి ఓటీపీ లేకుండా గ్యాస్ పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ అనుకూల ఏజెన్సీలు, కొందరు ప్రజా ప్రతినిధులు గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ జేబులు నింపుకోవడం సమస్యకు మరోకోణం. ఇక్కడ ఓటీపీతో పాటు ఈ–కేవైసీ సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వం 90 శాతానికిపైగా ఈ–కేవైసీ చేశామని ఆర్భాటంగా ప్రకటిస్తే.. గ్యాస్ ఏజెన్సీల అసోసియేషన్ 75 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయినట్టు చెప్పడం గమనార్హం.
పీఎన్జీ కోసమే ఎల్పీజీ జాప్యం..!
రాష్ట్రంలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున 84 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. ఇప్పుడు అది కాస్త పడిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం వినియోగదారులను పైప్డ్ నేచ్యురల్ గ్యాస్ (పీఎన్జీ)కు మారాలని ఉచిత సలహా ఇస్తోంది. వాస్తవానికి 3 లక్షల పీఎన్జీ కనెక్షన్ల సామర్థ్యం ఉన్న నెట్‌వర్క్‌లో కేవలం 65 వేల కనెక్షన్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి.
అధిక డిపాజిట్లు, నెలవారీ బిల్లు కట్టాల్సి రావడంతో ఇది సామాన్యులకు భారంగా మారుతోంది. అందుకే పెద్దగా ఇష్టపడట్లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం బలవంతంగా 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో.. ఎల్పీజీ సరఫరాలను కావాలనే జాప్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1.61 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లలో కనీసం 2 శాతం కూడా లేని పీఎన్జీకి విస్తృత ప్రచారం చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకోవడం విస్తుగొలుపుతోంది.
దీపం–2.0లో లబ్ధిదారులకు ఖేదం
చంద్రబాబు ప్రభుత్వం సామాన్యులను మోసం చేయడమే అజెండాగా పాలన సాగిస్తోంది. ముఖ్యంగా దీపం.–2.0 పథకంలో మహిళలను తీవ్రంగా వంచించింది. ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డుదారులు ఉన్నారు. వీళ్లందరూ అల్పాదాయ, పేద వర్గాలే. ఇక్కడ 1.61 కోట్ల ఎల్పీజీ గృహ కనెక్షన్లలో పేదలే ఎక్కువగా గ్యాస్ వినియోగిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏటా 85–90 లక్షల మందికి మాత్రమే ఉచిత గ్యాస్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. దాదాపు 60 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఎగనామం పెడుతోంది.


