AP New Cabinet: మంత్రి ఎవరు?, కానిదెవరు?

Comman People Try To Get To Know New Cabinet Of AP - Sakshi

ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ

అమాత్య పదవులపై  రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి

మంత్రి యోగం ఎవరికంటూ సామాన్య ప్రజలు సైతం ఆరా

మీడియా ప్రతినిధులకు పెరిగిన ఫోన్ల తాకిడి

మంత్రి పదవులనూ వదలని బెట్టింగ్‌ రాయుళ్లు

సాక్షి, అమరావతి: సార్‌.. మంత్రి పదవులు ఎవరికిస్తున్నారు? బాసు.. టెన్షన్‌ భరించలేకపోతున్నా.. మా ఎమ్మెల్యేకి మంత్రి పదవొస్తుందో 
రాదో చెప్పు?గురూ.. మా జిల్లాలో ఎవరెవరు మంతవ్రుతారు? తెలిస్తే చెప్పవా? ఏమండి.. పాత మంత్రులు ఎందరు ఉంటారు? కొత్తగా ఎవరొస్తారు?
ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా సాగుతున్న సంభాషణ. ఏ ఒక్కర్ని కదిలించినా ఒక్కటే మాట.. ‘మంత్రి అయ్యేదెవరు’? 

రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, జనం గుమికూడే ప్రధాన కూడళ్లతోపాటు ఫోన్లలోను కొద్ది రోజులుగా మంత్రి పదవులు ఎవరికి అనేది ఆరా తీయడమే కన్పిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్కంఠతతో తీవ్ర ఉన్నారు. సామాన్య ప్రజలు సైతం మంత్రులెవరో ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

మీడియా ప్రతినిధులకు ఫోన్ల తాకిడి
కొత్త మంత్రివర్గ కూర్పు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రుల నుంచి ఫోన్ల తాకిడి పెరిగింది. ఫోన్‌ చేసి మరీ మంత్రులెవరంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదేమంటే మీడియాకే మందు తెలుస్తుందనేగా మీకు చేస్తున్నదంటూ ఒకింత బెదిరిస్తున్నారు. సమాచారం రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులకు వచ్చిన కొన్ని ఫోన్లతో కొన్ని ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.. 

మోహన్‌: అన్నా నమస్తే.. మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారన్నా?
విలేకరి: ఏమో అన్నా.. నాకెలా తెలుస్తుంది. 
మోహన్‌: అదేంటన్న మీ మీడియాకే మందు తెలుస్తుంది కదా? 
విలేకరి: సమీకరణలు, మార్పులు, కూర్పులను ఏదో కొద్దిగా అంచనా వేసి కథనాలు ఇస్తుంటాం. అన్నీ మాకే తెలుసని నీవనుకుంటే ఎలా అన్నా?
మోహన్‌: సరే.. కొంచెం తెలిస్తే చెప్పండన్నా? 
విలేకరి: అలాగే ఏదైనా తెలిస్తే చెబుతాను.

రాంబాబు: సార్‌.. మంత్రుల లిస్ట్‌ వచ్చిందా?
విలేకరి: లేదండి.. అధికారికంగా విడుదల చేసాకే పూర్తి స్పష్టత వస్తుంది.
రాంబాబు: అదేంటి.. కొన్ని పత్రికల్లో ఏకంగా మంత్రుల జాబితాను వేసేస్తున్నారు కదా?
విలేకరి: ఉహాగానాలు వంద వస్తుంటాయి. ప్రభుత్వ అధికారిక ప్రకటనతోనే స్పష్టత వస్తుంది.
రాంబాబు: మా జిల్లాలో పేర్లు ఏమైనా తెలిశాయా బాసూ..
విలేకరి: జిల్లాలు, సామాజికవర్గాలవారీగా మంత్రులను సీఎం ఎంపిక చేస్తారంట. ఇప్పుడు మనం జిల్లాలో పలానా వాళ్లకు మంత్రి పదవి వచ్చేస్తోందని చెప్పలేం. ఎందుకంటే సామాజికవర్గ సమీకరణల్లో ఒక్కటి మారితే మిగిలిన పేర్లపైన ప్రభావం పడుతుంది. సామాజిక సర్దుబాటులో ఉండే జాబితా కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. మనం అంచనా వేయలేం.

శాస్త్రి: టెన్షన్‌ భరించలేకపోతున్నాం. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందంటారా? 
విలేకరి: టెన్షన్‌ ఎందుకండి. సీఎం వద్ద మంత్రుల జాబితా ఉంటుంది. సోమవారం ప్రమాణస్వీకారం కాబట్టి ఆదివారమే మంత్రుల జాబితా ప్రకటిస్తారని అంటున్నారు. మరో 24 గంటలు ఓపిక పడితే మీ టెన్షన్‌కు తెరపడుతుంది. 
శాస్త్రి: ఏమోనండీ.. ఈ టెన్షన్‌ ఎక్కువైపోతోంది. తెలిస్తే చెప్పండి ప్లీజ్‌..

మంత్రి పదవులపైనా బెట్టింగ్‌లు
సందట్లో సడేమియా అన్నట్టు బెట్టింగ్‌ రాయుళ్లు ఈ అంశాన్ని కూడా వదల్లేదు. పాత మంత్రుల్లో ఎంత మంది కొనసాగుతారు? కొత్తగా ఎంత మందికి ఇస్తారు? ఏఏ ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు? ఏ జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి? ఎవరికి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది? అనే అనేక కోణాల్లో పందేలు కడుతున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ తరహా బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం. 

చదవండి: AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top