AP New Ministers: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు!

15 New Ministers Into Andhra Pradesh Cabinet - Sakshi

ప్రస్తుతం 56 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మరింత ప్రాధాన్యం

ఇప్పటిదాకా ఉన్న కేబినెట్‌లోని 10 మంది కొనసాగే అవకాశం

మొత్తం మంత్రుల రాజీనామాలను గవర్నరుకు పంపిన ముఖ్యమంత్రి

25 మందితో రాజ్‌భవన్‌కు నేడు కొత్త జాబితా

కేబినెట్‌ బెర్తు దక్కించుకున్న వారికి సీఎంవో నుంచి నేడు ఫోన్‌

సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణం

తాత్కాలిక సచివాలయంలో బ్లాక్‌–1 పక్కన వేదిక సిద్ధం

కరకట్ట రోడ్డుపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు మాత్రమే అనుమతి

ప్రజలు, అభిమానులకు మంగళగిరి, ఎర్రబాలెం మీదుగా ఓ మార్గం..

ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా మరో మార్గం  

సాక్షి, అమరావతి: దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న కేబినెట్‌ నుంచి 10 మంది వరకూ... ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు.

అయితే తాజా పునర్వ్యవస్థీకరణలో బలహీనవర్గాల శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చంద్రబాబు నాయుడి కేబినెట్‌లో 25 మంది మంత్రులకు గాను మెజారిటీ.. అంటే 13 మంది అగ్రవర్ణాల వారుండగా, బలహీనవర్గాలు 12 మందే ఉండి 48 శాతానికే పరిమితమయ్యారు. దానికి భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరింత కీలక భాగస్వాములను చెయ్యాలనే దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 56 శాతం కేబినెట్‌ బెర్తులు వారికే కేటాయించారు. ఇపుడు ఆ సంఖ్యను మరింత పెంచబోతున్నారు. 

గవర్నరుకు రాజీనామాలు 
మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులుండగా ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడం తెలిసిందే. మిగిలిన 24 మంది మంత్రులూ పార్టీ బాధ్యతలు తీసుకోవటానికి స్వచ్ఛందంగా రాజీనామా చేయటంతో... వారి రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపారు. వీటిని గవర్నర్‌ ఆమోదించాక రాజ్‌భవన్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుంది. అనంతరం కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్‌.. గవర్నర్‌కు పంపనున్నారు. మంత్రివర్గం కూర్పుపై సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న కసరత్తు ఆదివారం మధ్యాహ్నానికి కొలిక్కి వస్తుందని, ఆ వెంటనే కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపుతారని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటిదాకా ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మంది చేరుతారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. వారందరికీ ఆదివారం మధ్యాహ్నం గవర్నర్‌కు జాబితా పంపించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి సమాచారమిస్తారని, సోమవారంనాడు అందుబాటులో ఉండాల్సిందిగా చెబుతారని తెలియవచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం  కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్‌ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్‌ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. 

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు  
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్‌) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు.  

ప్రభుత్వ పాస్‌ ఉంటేనే అనుమతి 
నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌) : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వారు ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పాస్‌లను వెంట తెచ్చుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సభా స్థలంలోకి అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటలలోపు రావాలన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే లోటస్‌ జంక్షన్‌ నుంచి కరకట్ట మీదుగా ప్రయాణించేందుకు నిర్ధేశించారని తెలిపారు. గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అభిమానులు, వాహనదారులు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి జంక్షన్, మంగళగిరి, డాన్‌బాస్కో స్కూల్, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా సభా స్థలికి చేరుకోవాలన్నారు. విజయవాడ, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారు ఉండవల్లి సెంటర్, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా రావాలని చెప్పారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం దృష్ట్యా తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు అందరూ సహకరించాలని కోరుతూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top