ఒంగోలు జిల్లా జైలు సూపరింటెండెంట్ పేరుతో ఖైదీల కుటుంబసభ్యులకు ఫోన్
ఒంగోలు టౌన్: రిమాండ్‌లో ఉన్న ఖైదీల ఆరోగ్యం సీరియస్‌గా ఉందంటూ జిల్లా జైలు సూపరింటెండెంట్ పేరుతో ఫోన్‌చేసిన ఆగంతకులు డబ్బులు వసూలు చేసిన ఘటనలు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సంచలనం కలిగించాయి. బాధితుల కథనం ప్రకారం.. పేర్నమిట్ట గ్రామానికి చెందిన శిఖా నితిన్, కంధేరి వెంకటనాగరాజు, ఒంగోలు నగరానికి చెందిన దుర్గ, చింటూలను గత నెల 27వ తేదీ రాత్రి తాలూకా పోలీసులు గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత రోజు వారిని రిమాండ్‌కు పంపించారు.
గత ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో శిఖా నితిన్ తండ్రి కోటికి ఒకవ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను మాట్లాడుతున్నానంటూ అతడు.. నితిన్ ఆరోగ్యం బాగోలేకపోతే జీజీహెచ్ వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్‌కు తరలించామని చెప్పాడు. ఐసీయూలో ఉన్న నితిన్‌కు ప్లేట్‌లెట్స్ ఎక్కించడానికి వెంటనే డబ్బులు పంపించాలని కోరాడు. తనవద్ద డబ్బులు లేవని కోటి సమాధానం ఇవ్వడంతో నితిన్‌కు ఏమైనా అయితే తమకు సంబంధం లేదని భయపెట్టి క్యూఆర్ కోడ్ పంపించాడు. దీంతో కోటి రూ.9 వేలు పంపించారు.
కోటి తనకు తెలిసిన జైలు సిబ్బంది ద్వారా ఆరా తీయగా జైలులో నితిన్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై కోటి తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండురోజుల తరువాత బుధవారం ఉదయం 10–11 గంటల సమయంలో కంథేరి వెంకటనాగరాజు భార్య ప్రేమజ్యోతికి ఆగంతకుడు ఫోన్ చేశాడు. నాగరాజు ఆరోగ్యం సీరియస్‌గా ఉందని, తిరుపతి తరలించామని చెప్పాడు. అతడికి బ్లడ్ ఎక్కించడానికి రూ.10 వేలు పంపించమని కోరాడు. అప్పటికే ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో ఉన్న జ్యోతి అప్పుచేసి రూ.5 వేలు ఫోన్‌పే చేసింది.
జైలులో ఉన్న నిందితుల కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లు ఆగంతకుడికి ఎలా తెలిశాయన్నది మిస్టరీగా ఉంది. జైలు సిబ్బంది నుంచో, పోలీసుస్టేషన్ నుంచో ఆ నంబర్లు బయటకు వెళ్లి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగంతకుడి ఫోన్ నంబరును ట్రూ కాలర్‌లో పరిశీలించగా అతడి పేరు బాలకృష్ణ అని వస్తోంది. ఈ విషయమై జైలు సూపరింటెండెంట్ రాజకుమార్‌ను వివరణ కోరగా.. దీనిపై తాను విచారించి చర్యలు తీసుకుంటానని చెప్పారు.


