సెల్ఫీ తీసుకుంటుండగా కోబ్రా కాటేసింది

Cobra Bite to Young Man at Kandukuru - Sakshi

పామును మెడలో వేసుకుని ఫొటోలకు ఫోజు

కిందపడ్డ పామును పట్టుకోబోగా కాటేసిన నాగు

ఆస్పత్రికి తరలించగా ప్రాణాలొదిలిన యువకుడు 

కందుకూరు: నాగుపాముతో సెల్ఫీకి  ప్రయత్నించిన ఓ యువకుడు ఆ పాము కాటేయడంతో ప్రాణాలొదిలాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి (22) కందుకూరులోని జేఏ కాంప్లెక్స్‌లో షాపును అద్దెకు తీసుకుని జ్యూస్‌ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు.

ఆ పామును చూసి సంబరపడిన మణికంఠరెడ్డి పాముతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పామును మణికంఠరెడ్డి మెడలో వేసుకోగా.. ఆ పాము జారి కిందపడిపోయింది. దీంతో మణికంఠరెడ్డి పాము తోక పట్టుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాటేసింది. వెంటనే స్నేహితులు మణికంఠను ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మణికంఠ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం
మధ్యలో మృతి చెందాడు.

కోరలు లేవని చెప్పడం వల్లే..
పామును ఆడించే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని చెప్పాడు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని దానిని ఆడించే వ్యక్తి చెప్పాడు.

అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్‌ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని కందుకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై కిశోర్‌ పరిశీలించారు. పామును తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top