AP: సర్వం.. త్రివర్ణ శోభితం | CM YS Jagan will hoist flag at Vijayawada Indira Gandhi Stadium | Sakshi
Sakshi News home page

సర్వం.. త్రివర్ణ శోభితం

Published Mon, Aug 15 2022 3:16 AM | Last Updated on Mon, Aug 15 2022 8:50 AM

CM YS Jagan will hoist flag at Vijayawada Indira Gandhi Stadium - Sakshi

మువ్వన్నెల పతాకాలతో రాష్ట్రం ముస్తాబైంది.. మన స్వేచ్ఛా జీవితానికి బాటలు వేసిన అమర వీరులకు జోహార్‌.. భారత్‌ మాతాకు జై.. అన్న నినాదాలు అన్ని ఊళ్లలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలపై జాతీయ జెండా గర్వంగా తలెత్తుకుని రెపరెపలాడుతోంది.. అన్ని వర్గాల ప్రజల్లో భావోద్వేగం ఉట్టిపడుతోంది. మహనీయుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రజానీకం అడుగులు ముందుకు వేస్తోంది. 

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి నెట్‌వర్క్‌: ‘దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే.. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ’.. అంటూ యావత్‌ దేశ ప్రజానీకం మొత్తం త్రివర్ణ పతాకాన్ని చేతబట్టింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌– హర్‌ ఘర్‌ తిరంగా పిలుపునందుకుని ఊరూ వాడా నాటి త్యాగధనులను స్మరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ సంబరానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధమైంది.  ప్రభుత్వ స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ప్రజలు జెండాలను ఇళ్లపై ఎగురవేశారు.  

ఎటు చూసినా అదే వేడుక 
స్వాతంత్య్ర దిన వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర శాసనసభ, సచివాలయ భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. బందరు రోడ్డు, సీఎం క్యాంప్‌ కార్యాలయం విద్యుత్‌ దీప కాంతులతో ప్రకాశిస్తోంది.  జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ బంగ్లాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక కట్టడాలు దీప కాంతులను నింపుకున్నాయి. ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్లలో జాతీయ జెండా ఆకృతులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఉత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 195 మంది ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలవుతున్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన అనేక మంది ప్రభుత్వం నుంచి పతకాలు అందుకోనున్నారు.  
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం 

3 కి.మీ పొడవునా జాతీయ పతాకం  
ఒంగోలులో ఆదివారం ‘త్రివర్ణ ప్రకాశం’  పేరుతో 600 కేజీల బరువు, మూడు మీటర్ల వెడల్పు, 3 కి.మీ పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు.  నరసరావుపేటలోని ఆజాదీపార్కులో 109 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు.  
శ్రీకాళహస్తిలో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శిస్తున్న జనం   

ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు 
రాష్ట్ర స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఇక్కడ జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది ప్రజలకు అనుమతి ఇస్తున్నారు.  300 అడుగుల ఎత్తులో జెండాను ఎగుర వేస్తున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే తేనీటి విందు (ఎట్‌ హోమ్‌)కు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారు.    

‘తూర్పు’లో ఆకట్టుకుంటున్న ‘కూర్పు’

తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని చాటే విధంగా మొక్కల కూర్పులతో ఆకట్టుకుంటున్నాయి. కడియపులంకలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ (చంటియ్య), పెద సత్యనారాయణలకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో పలు రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. హర్‌ ఘర్‌ తిరంగా, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్, 75 వసంతాల జెండా పండగలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతి చూపరులను ఆకట్టుకుంటోంది.   
 – కడియం 

 ‘జల’ జెండా!

75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాద జెడ్పీ హైస్కూల్‌ డ్రాయింగ్‌ టీచర్‌ జి.శ్రీను నీటితో జెండాను రూపొందించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ‘జల’ జెండాను తాకి చిన్నారులు మురిసిపోతున్నారు. జెండా అమరికకు అనుగుణంగా తొలుత ఒక గొయ్యి తవ్వి, కింద హైలమ్‌ షీట్‌ అమర్చారు. ఆ గొయ్యిని 3 భాగాలుగా విభజించి, త్రివర్ణ పతాకం రంగులు వచ్చేలా నీటిని నింపారు.     
– రామచంద్రపురం రూరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement