పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

CM YS Jagan Speaks PM Narendra Modi Video Conference Over Coronavirus - Sakshi

పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌

సాక్షి, అమరావతి: కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని తెలిపారు. ప్రతి పది లక్షల మందికి 47,459 పరీక్షలు జరిపామని చెప్పారు. మరణాలు రేటు 0.89 శాతంగా ఉందన్నారు. క్లస్టర్లలోనే 85 నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందన్నారు. వైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్‌ చేస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ వచ్చే నాటికి వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదని, ఇప్పుడు ప్రతి పది లక్షల మందికి 47 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని సీఎం జగన్‌ ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఉన్నాయని, టెస్టుల విషయంలో స్వాలంబన సాధించామని తెలిపారు. దాదాపు 2లక్షల మంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్‌ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారని సీఎం వెల్లడించారు. అవసరమైన అందరికి టెస్టులు చేస్తున్నామని, ప్రతి రోజు 9 వేల నుంచి 10 వేల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 109 కోవిడ్‌కేర్‌ సెంటర్లు, 56 వేలకుపైగా బెడ్లు ఉన్నాయని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు కేవలం 3,286 మాత్రమే ఉండేవని తెలియజేశారు. ప్రస్తుతం రాష్టంతో 11 వేలకుపైగా ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని వెల్లడించారు.

గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నామని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ వివరించారు. అలాగే హెల్ప్‌ డెస్క్‌లను పెట్టామని, పేషెంట్లను త్వరగా అడ్మిట్‌ చేయించడానికి వీరు సహాయపడుతున్నారని తెలిపారు. ప్రతి మండలంలో 108 అంబులెన్స్‌ ఉన్నాయని, కోవిడ్‌కు ముందు 108 అంబులెన్స్‌ వాహనాలు 443 ఉంటే, కోవిడ్‌ సమయంలో మరో 768 అంబులెన్స్‌లు సమకూర్చుకున్నామని చెప్పారు. 108, 104 వాహనాలు కలిపి కొత్తగా 1088 పైగా తీసుకొచ్చామని వివరించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహానగరాలు తమకు లేవని, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవని వైఎస్‌ జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకుచ్చారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top