సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారం

CM YS Jagan Review On YSR Jagananna Saswatha Bhu Hakku - Sakshi

నిర్దేశించుకున్న గడువులోపు సమగ్ర సర్వేను పూర్తి చేయాలి

దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి

అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలి

సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలి.. ప్రతి అంశంలోనూ వేగం ఉండాలి

రీసర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: సమగ్ర సర్వేతో అన్ని భూ వివాదాలు పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సమగ్ర సర్వే లక్ష్యాల్లో భూ వివాదాల పరిష్కారం ఒకటని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలు తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించుకున్న గడువులోగా సమగ్ర సర్వేను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని, సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు. డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లుతో పాటు సర్వే రాళ్లు సమకూర్చుకోవడం వంటి ప్రతి అంశంలోనూ వేగంగా పనిచేయాలని స్పష్టంచేశారు. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.

వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, దీన్ని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు. సమగ్ర సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటివరకూ సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top