యుద్ధ ప్రాతిపదికన డిజిటల్‌ లైబ్రరీలు | CM YS Jagan Review Meeting on Department of Energy, Digital Library Project | Sakshi
Sakshi News home page

యుద్ధ ప్రాతిపదికన డిజిటల్‌ లైబ్రరీలు

Jan 19 2022 1:07 PM | Updated on Jan 20 2022 7:32 AM

CM YS Jagan Review Meeting on Department of Energy, Digital Library Project - Sakshi

సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి తొలి దశ డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్, యూపీఎస్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్‌ టేబుల్స్, సిస్టం చెయిర్స్, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, ఐరన్‌ ర్యాక్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్‌ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఫేజ్‌–1 లో మిగిలిపోయిన డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్‌ 2లో కవర్‌ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందని, ఇంకా మొదలు కాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు.

కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులపై మరింత ధ్యాస పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్‌ ఫ్రం హోం సులువవుతుందని పేర్కొన్నారు. ఫేజ్‌ –1లో 4,530 గ్రామాల్లో ఏర్పాటవుతున్న డిజిటల్‌ లైబ్రరీలకు అవసరమైన నెట్‌ కనెక్టివిటీ ఫిబ్రవరి 2022 నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

చదవండి: కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్‌ సమీర్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement