తొలి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్‌

CM YS Jagan Review On IT Department And Digital Library - Sakshi

సాక్షి, అమరావతి: వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్‌ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు.. గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్‌ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులతోపాటు.. అన్ని రకాల పోటీల పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్‌ ఉండాలని అధికారులను ఆదేశించారు.

గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలకూ ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలని, నిరంతరం ఇంటర్నెట్‌ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, తొలి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆగస్టు 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈలోగా స్థలాలు గుర్తించి హ్యాండోవర్‌ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ నాటికి డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా.. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఫైబర్ నెట్‌, పంచాయతీరాజ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top