AP: ‘మత్స్యకార భరోసా' పథకం.. నేరుగా ఖాతాల్లోకి రూ.10వేలు

CM YS Jagan Released YSR Matsyakara Bharosa Money To Fishermen Accounts - Sakshi

సాక్షి, అమరావతి: సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేసింది. మంగళవారం ఉదయం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. 

ఈ పథకం కింద సంతృప్త స్థాయిలో (అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా) 1,19,875 కుటుంబాలకు రూ.10వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.

రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన సర్కారు
గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు.

ఈరోజు మత్యకార భరోసా పథకాన్ని అమలు చేసిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా ఉండేందుకే వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నాం.  అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారులను ఆదుకున్నవారే లేరు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నాం’ అనిపేర్కొన్నారు.

అదేవిధంగా ఆక్వా సాగు చేసేవారి కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ అన్నారు.  రాష్ట్రంలో రూ.2,775 కోట్లతో 8 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 4 ఫిషింగ్‌ హార్బర్లకు టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 100కు పైగా ఆక్వా హబ్‌లను నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టామని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

చదవండి: YS Jagan: నెలాఖరు దాకా కర్ఫ్యూ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top