పశ్చిమ గోదావరిలో ‘జగనన్న పాల వెల్లువ’కు సీఎం జగన్‌ శ్రీకారం | CM YS Jagan Launched AP Amul Project In West Godavari | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరిలో ‘జగనన్న పాల వెల్లువ’కు సీఎం జగన్‌ శ్రీకారం

Jun 4 2021 12:04 PM | Updated on Jun 4 2021 1:41 PM

CM YS Jagan Launched AP Amul Project In West Godavari - Sakshi

పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

సాక్షి, అమరావతి/పశ్చిమగోదావరి: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువకు శ్రీకారం చుట్టామన్నారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశానని, లీటర్‌ పాల ధర కంటే లీటర్‌ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

‘‘ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చాం. అమూల్‌ సంస్థలో వాటాదారులంతా పాలు పోసే అక్కాచెల్లెమ్మలు. పాలసేకరణలో చెల్లించే ధరలు.. మిగిలిన సంస్థల కంటే అమూల్‌ సంస్థలో ఎక్కువ. అమూల్‌ ద్వారా పాడిరైతులకు మంచి లాభాలు వస్తున్నాయి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

‘‘ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో పాల సేకరణ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ప.గో.జిల్లాలోని 153 గ్రామాల్లో అమూల్‌ సంస్థ పాలసేకరణ చేస్తుంది. రాష్ట్రంలో 9,899 గ్రామాలకు అమూల్‌ను విస్తరిస్తాం. లీటర్‌కు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు వచ్చేలా చేస్తాం. 13,739 మంది అక్కాచెల్లెమ్మలకు ఇప్పటివరకు అదనంగా రూ.4 కోట్ల 6 లక్షలు వచ్చింది. పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు. ఏఎంసీ, బీఎంసీ వద్ద పాలు పోసిన వెంటనే నాణ్యత తెలిపి స్లిప్‌ ఇస్తారు. ఆ స్లిప్‌ ఆధారంగా ప్రతి లీటర్‌కు రూ.5 నుంచి రూ.15 అదనంగా వస్తుందని’’ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధికి సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు: అమూల్‌ ఎండీ
గ్రామాల అభివృద్ధికి సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అమూల్‌ ఎండీ  సోథీ అన్నారు. అమూల్‌ సంస్థ రైతుల భాగస్వామ్యంతోనే నడుస్తోందన్నారు. అమూల్‌ సంస్థకు వచ్చే లాభాలను పాడిరైతులకే అందిస్తున్నామని అమూల్‌ ఎండీ తెలిపారు. 
 

చదవండి: వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్‌
ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్‌ జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement