మనసున్న ప్రభుత్వమిది | CM YS Jagan Comments on Minorities Welfare Day | Sakshi
Sakshi News home page

మనసున్న ప్రభుత్వమిది

Published Sun, Nov 12 2023 4:41 AM | Last Updated on Sun, Nov 12 2023 8:39 AM

CM YS Jagan Comments on Minorities Welfare Day - Sakshi

భారతదేశం అంటేనే ఏడు రంగుల ఇంద్ర ధనస్సు. మన దేశంలో అనేక రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, అనేక కులాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా, అందరం కలిసికట్టుగా.. ఇంద్ర∙ధనస్సుగా ఒక్కటిగా ఉంటున్నాం.. ఎప్పుడూ ఉంటాం అన్నది భారతదేశ చరిత్ర. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు ఒకరినొకరు గౌరవించుకోవడం మన బలం. అల్ప సంఖ్యలో ఉన్న వారికి అండగా నిలబడటం మన బలం. మెజారిటీ, మైనార్టీల మధ్య అన్నదమ్ముల ఆత్మీయత, అనుబంధం పెంచటం ఒక వైఎస్సార్‌ బలం.. ఒక జగన్‌ బలం.. వెరసి మన అందరి బలం. 

గత 53 నెలల్లో దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ముందెన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ పేదల కోసం పరితపిస్తూ పరిపాలన సాగిస్తోంది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ నిరుపేదలంటూ గతంలో ఓనర్‌ షిప్‌ (బాధ్యత) తీసుకున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ వర్గాల వారందరినీ నా కుటుంబంగా భావిస్తున్నా. వీరికి అన్ని విధాలా భరోసా ఇస్తూ అడుగులు ముందుకు వేస్తున్నా.      
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వంలో ఒక జగన్‌ కనిపిస్తాడు. జగన్‌కు ఇటు వైపు, అటు వైపు డిప్యూటీ సీఎంలుగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ కనిపిస్తారు. మీ బిడ్డ సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచీ వీళ్లందరూ నా పక్కనే కనిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది. మనసున్న ప్రభుత్వం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాలను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే గా జరుపుకుంటున్నామన్నారు.

మైనారిటీస్‌ సంక్షేమ దినోత్సవంగా (మైనార్టీస్‌ డే) కూడా జరుపుకుంటున్నట్లు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, దివంగత రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రకటించారని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ముస్లింలలో పేదలందరికీ రిజర్వేషన్లు అమలు చేసిన నాయకుడు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. నాన్న ముస్లిం సోదరుల పట్ల, మైనార్టీల సంక్షేమం పట్ల ఒక అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా, మీ అన్నగా, మీ వాడిగా రెండడుగులు ముందుకు వేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

గతానికి, ఇప్పటికి మధ్య తేడా గమనించండి 
► గత ప్రభుత్వంలో మైనార్టీలకు మంత్రి పదవి కూడా ఇవ్వని మనసు లేని ముఖ్యమంత్రి ఉండేవారు. మన ప్రభుత్వంలో రెండు దఫాలు మంత్రి మండలి కూర్పులో ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో నా మైనార్టీ సోదరుడు ఈ రోజు నా పక్కనే ఉన్నాడు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక అనేక గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయి.  

► ఈ రోజు ముస్లిం సోదరులకు రాజకీయ, ఆర్థిక, మహిళా, విద్యా సాధికారత విషయంతో పాటు వారికి సంక్షేమం అందించే ఏ విషయంలోనైనా ముందున్నాం. మన పార్టీ నుంచి దేవుడి దయతో నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగాం. మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా కూర్చొబెట్టగలిగాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నా సోదరి జకియాఖానం శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. నా అక్కచెల్లెమ్మలు, ముస్లిం సోదరుల బాగోగులు చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాగా అడుగులు వేస్తోందో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. 

► ఎంపీపీలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్, కార్పొరేషన్‌ చైర్మన్, ఏఎంసీ.. ఇలా ఏ నామినేటెడ్‌ పదవులు తీసుకున్నా.. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 50 శాతం పదవులు ఇవ్వాలని.. అందులో కూడా 50 శాతం నా అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేశాం.   

► ఈ రోజు, ఆ రోజు ఇదే బడ్జెట్‌.. ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. మారిందల్లా  ముఖ్యమంత్రి మాత్రమే. ఈ 53 నెలల కాలంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా మీ బిడ్డ బటన్‌ నొక్కితే నేరుగా రూ.2.40 లక్షల కోట్లు (డీబీటీ) అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. మరి అప్పట్లో ఈ రూ.2.40 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయన్నది ఆలోచించండి. పేదవాళ్లు వెళ్తున్న స్కూళ్లు, ఆస్పత్రులు కూడా మార్పు చేస్తున్నాం. గుడ్‌మారి్నంగ్‌ చెబుతూ ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలకు వారి ఇంటి వద్దే పెన్షన్‌ ఇచ్చే గొప్ప పాలన జరుగుతున్న రోజులకు, నాటి రోజులకు మధ్య తేడా గమనించండి.   

విజయవాడ నుంచే హజ్‌ యాత్ర  
► గతంలో హజ్‌ యాత్రకు వెళ్లాలంటే హైదరాబాద్‌ నుంచి వెళ్లే పరిస్థితి. విజయవాడ నుంచి నేరుగా వెళ్లేలా ఎంబార్కేషన్‌ పాయింట్‌గా ప్రకటించాం. ఆ తర్వాత హజ్‌ యాత్రకు హైదరాబాద్‌ కంటే విజయవాడ నుంచి విమాన టిక్కెట్‌ రూ.80 వేలు ఎక్కువగా వేశారని డిప్యూటీ సీఎం అంజాద్‌  చెప్పాడు. మనం ఇవ్వాలంటే అవుతుందా.. అని అడిగాడు. ఇక్కడ ఉన్నది మనందరి ప్రభుత్వం కాబట్టి.. కచ్చితంగా తోడుగా ఉంటామని చెప్పాను. 

► రూ.14 కోట్లు ఎక్కువ అవుతుందంటే వెంటనే చెక్కు ఇచ్చి కార్యక్రమాన్ని కొనసాగించాం. నేను అడిగిందల్లా ఒక్కటే.. హజ్‌ యాత్రకు వెళ్లినప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం కోసం దువా చేయండి అని. ఈ రోజు మైనార్టీలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం మనది.  

► అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం పెంచాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పాస్టర్‌లకు కూడా రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే. వక్ఫ్‌ బోర్డు, ముస్లిం మైనార్టీ, చర్చిలకు సంబంధించిన ఆస్తుల సంరక్షణ కోసం ఏకంగా జీవో నెంబరు 60 జారీ చేశాం. వీటి రక్షణ కోసం ఒక జీవో ఇచ్చి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసిన తర్వాత సచివాలయంలో ఉన్న ప్లానింగ్‌ సెక్రటరీలకు ఇన్‌ఛార్జ్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ బాధ్యతలు అప్పగిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది. దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటున్నా. 

అవార్డుల ప్రదానం 
మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అవార్డులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందజేశారు. మౌలానా ఆజాద్‌ జాతీయ అవార్డు–2023 డాక్టర్‌ ఎస్‌ఏ సత్తార్‌ సాహెబ్‌ (వైఎస్సార్‌ కడప), డాక్టర్‌ అబుల్‌ హక్‌ అవార్డు–2023 బాబా ఫకృద్దీన్‌ (అన్నమయ్య జిల్లా), పఠాన్‌ కరీముల్లా ఖాన్‌ (చిత్తూరు)కు అందించారు. జీవిత సాఫల్య (లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌) అవార్డు2023ను మహ్మద్‌ అజ్మత్‌ అలీ (కర్నూలు), మహ్మద్‌ నజీర్‌ (గుంటూరు), మహ్మద్‌ హఫీజర్‌ రెహ్మాన్‌ (నంద్యాల), పఠాన్‌ మహ్మద్‌ ఖాన్‌ (మదనపల్లె), షేక్‌ అబ్దుల్‌ గఫర్‌ (కర్నూలు), సయ్యద్‌ షఫీ అహ్మద్‌ ఖాద్రీ (తిరుపతి), మహ్మద్‌ గౌస్‌ ఖాన్‌ అరీఫ్‌ (వైఎస్సార్‌ కడప)కు అందజేశారు.

37 మంది రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులకు, 51 మంది ఉర్దూ విద్యార్థుల­కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఉపా«ధ్యక్షురాలు జకియాఖానమ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, మైనార్టీస్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.ఇక్బాల్‌ అహ్మద్, హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌ లాజమ్, ఉర్దూ అకాడమి చైర్మన్‌ హెచ్‌.నదీమ్‌ అహ్మద్, వక్ఫ్‌ బోర్డు మాజీ చైర్మన్‌ ఖాదర్‌ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు రుహుల్లా, తలశిల రఘురాం, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.  

మైనార్టీలకు 53 నెలల్లో రూ.23,176 కోట్లు 
► నా ముస్లిం మైనార్టీలనే తీసుకుంటే.. ఈ 53 నెలల కాలంలో డీబీటీ, నాన్‌ డీబీటీ కింద రూ.23,176 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ ఇలా ఏ పథకం తీసుకున్నా నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూసే విధంగా అడుగులు వేయగలిగాం. గత పాలనలో కేవలం రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తేడా మీరే గమనించాలి.  

► ప్రతి అడుగులో, ప్రతి పనిలో, వేసే ప్రతి మొలక చెట్టు కావాలని, ప్రతి ముస్లిం కుటుంబం కూడా బాగు పడాలని, వారి పిల్లలు గొప్పగా ఎదగాలనే తపనతో అడుగులు పడ్డాయి. ఈ మధ్య కాలంలో షాదీ తోఫా పథకాన్ని తీసుకొచ్చాం. నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, వారిని చదివించే విధంగా ప్రోత్సహించేందుకు షాదీ తోఫా కోసం పదోతరగతి పాస్‌ కావాలన్న నిబంధన పెట్టాం. ఆ నిబంధన పెట్టినప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం.. మనం ఇలాంటి కండిషన్లు ఎందుకు పెట్టడం.. తీసేద్దాం అని కొందరు అన్నారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను. నాయకుడు అన్నవాడు ఆలోచన చేయాల్సింది ఎన్నికల గురించి కాదు.. రేప్పొద్దున వీళ్ల జీవితాల్లో వెలుగు ఎలా నింపాలని, వారి భవిష్యత్‌ కోసం ఆలోచనలు జరగాలని చెప్పాను. 

► ఈ రోజు మనం పదోతరగతి సర్టిఫికెట్‌ తప్పనిసరి అని చెప్పడంతో పాటు రూ.లక్ష పెళ్లి చేసుకునేటప్పుడు ఇస్తా­మని చెబుతున్నాం. అప్పుడు దానికోసం కచ్చితంగా పదోతరగతి వరకు చదివించే దిశగా తల్లిదండ్రులు అడుగులు వేస్తారు. ఆ పిల్లలు కూడా చదవడం మొదలు పెడతారు. ఆ పిల్లలు చదువుల కోసం అమ్మఒడి పథకం ద్వారా అడుగులు ముందుకు వేయించగలుగుతాం. నాడు–నేడు ద్వారా స్కూళ్లను మార్పు చేస్తున్నాం. ఇంగ్లిషు మీడియం, 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలో ఐఎఫ్‌పి డిజిటల్‌ స్క్రీన్లు, బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్‌ బాగుండేలా ఊతమిస్తాయి.   

► ఉన్నత విద్యకు వచ్చేసరికి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ (విద్యా దీవెన), వసతి దీవెన ఇస్తున్నాం. ఏ పేద తల్లి తన పిల్లలను చదవించేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపించే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. అందులో మరో అడుగు కళ్యాణమస్తు (బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని పేదల కోసం), షాదీతోఫా పథకాలని గొప్పగా చెప్పగలను.  

► మనందరి ప్రభుత్వం వచ్చాక ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల మైనార్టీల కోసం సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నది కూడా మన ప్రభుత్వమే. దీనికోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్‌ చట్టం– సబ్‌ప్లాన్‌ను తీసుకువచ్చాం.   

మహనీయుల ఆదర్శంతో ప్రజా రంజక పాలన  
భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వంటి ఎంతో మంది మహనీయులను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్‌  కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజా రంజక పాలన అందిస్తున్నారు. జగన్‌ మంత్రివర్గంలో తొలి ముస్లిం ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రిగా పని చేస్తుండటం నా అదృష్టం. నాడు వైఎస్సార్‌ ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకురావడంతో ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు పొందారు.

ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్‌ ముస్లిం మైనార్టీలకు రాజకీయ సాధికారత కల్పించారు. ఐదుగురిని ఉప ము­ఖ్యమంత్రులుగా చేస్తే, అందులో నేనూ ఒకడిని. నలుగురు ముస్లిం ఎమ్మెల్సీలలో మహిళకు తొ­లి­సారి అవకాశం ఇచ్చారు. ముస్లిం సోదరులు నలుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. ముస్లింలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సంక్షేమ ఫ­లాలు అందిస్తున్నారు. 
– అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement