ఘనంగా ఇఫ్తార్‌ విందు 

CM YS Jagan Attends To Iftar Party At Vijayawada - Sakshi

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ముసాఫిర్‌ ఖానాకు ప్రారంభోత్సవం

సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తలపై టోపీ ధరించి ఆద్యంతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు సీఎం.. విజయవాడలోని వన్‌టౌన్‌ వించిపేటలో షాజహుర్‌ ముసాఫిర్‌ ఖానా భవనాన్ని ప్రారంభించారు. 
ఇఫ్తార్‌ విందులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

హోరెత్తిన సభా ప్రాంగణం 
ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి సీఎం ఇఫ్తార్‌ విందుకు వెళ్తున్న క్రమంలో సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది. యువత సెల్‌ ఫోన్లలో సీఎంను ఫొటోలు, వీడియో తీస్తూ సందడి చేశారు. అంతకు ముందు వేదికపై నుంచి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.
నమాజ్‌ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు 

ఉర్దూకు రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్‌ 4 % రిజర్వేషన్‌తో ముస్లింలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే.. ఆయన వారసుడు సీఎం జగన్‌ అంతకు మించి సంక్షేమాభివృద్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, రోజా, శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌ జకియా ఖానమ్, పలువురు ఎమ్మెల్యేలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top