ఆప్యాయంగా పలకరిస్తూ..

CM YS Jagan and family members reached Idupulapaya - Sakshi

ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్, కుటుంబ సభ్యులు

దాదాపు 40 నిమిషాల పాటు పలు వినతి పత్రాల స్వీకారం

నేడు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు 

సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వైఎస్సార్‌ కడప జిల్లాకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్‌ వారిని పేరుపేరున సాదరంగా పలకరించారు. సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైఎస్‌ భారతితో కలిసి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్‌ 5.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 5.50కి ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 6.30 గంటల వరకు అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌.రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బిజేంద్రనాథరెడ్డి, కలెక్టర్‌ వి.విజయరామరాజు, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి తదితరులున్నారు.

నేడు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళతారు. 

ఇడుపులపాయకు చేరుకున్నవైఎస్‌ విజయమ్మ, షర్మిల 
వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్సార్‌ కుమార్తె, వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల, కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. గురువారం ఉదయం వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top