సీఎం జగన్‌ పాదాలకు నమస్కరిస్తున్నా.. 12 గంటల్లోనే రూ.10లక్షలు

CM Jagan Sanctioned 10 Lakhs for Allagadda Moulali liver Transplantation - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యువకుడు ఆళ్లగడ్డ మౌలాలి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం తాను ప్రతిపాదన పంపిన వెంటనే రూ.10లక్షలు మంజూరు చేస్తూ (ఎల్‌ఓసీ) ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాదాలకు నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక పుట్టపర్తి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఎల్‌ఓసీని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు, తమ పార్టీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు హనీఫ్, షా హుసేన్‌తోపాటు నూరి, కౌన్సిలర్లు జిలాని బాషా, కమాల్, యెల్లాల మహ్మద్‌ గౌస్, వడ్ల ఖలీల్, ఇర్ఫాన్‌ బాషా తదితరులు సమస్యను తన దృష్టికి తేవడంతో తన కార్యాలయం నుంచి గురువారం సీఎం కార్యాలయానికి లేఖను పంపి ఫోన్‌ చేసినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేవలం 12 గంటల్లోనే లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారని, బాధితుడు మౌలాలి హైదరాబాద్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడన్నారు.

మౌలాలికి అతని భార్య లివర్‌ ఇస్తోందని చెప్పారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే మిగతా రూ.10లక్షల్లో తన వంతుగా సొంత డబ్బు రూ.3 లక్షలు ఇస్తున్నానని, మిగతా రూ.7లక్షలను పార్టీ నాయకులు అందిస్తున్నారని తెలిపారు. పెద్దమనసుతో స్పందించి 12 గంటల్లోనే రూ.10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి మానవత్వాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం పట్టణానికి చెందిన కరీముల్లా లివర్‌ ప్లాంటేషన్‌ కోసం సీఎం రూ.25 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనారిటీ నాయకులతోపాటు షాపీర్‌ ఆలి పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top