మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

CM Jagan Review Meeting On Women And Child Welfare Department - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టిన సీఎం.. దాదాపు రూ.1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని.. మూడు విడతల్లో చేపట్టాలని ఆయన ఆదేశించారు. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలన్న సీఎం.. ప్రతి మండలంలో కూడా పనులు జరిగేలా మూడు విడతలకూ కార్యాచరణ చేయాలని సీఎం పేర్కొన్నారు.

‘‘అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. సమగ్రమైన ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలి. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలి. సూపర్‌వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌:
‘‘స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు.

‘‘నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలి. అలాగే పిల్లలకు ప్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్‌  రూపొందించుకోవాలి. అంగన్‌వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకు రావాలి. అంగన్వాడీలలో స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలి’’ అని సీఎం సూచించారు.

‘‘అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాలి. వైద్య పరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలి. తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలి.

ఈ విషయంలో అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్,  వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అందరితో పాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా.. అదనంగా ఇస్తూ... వీరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలి. ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో దీనికి పరిష్కారం చూపించాలి. తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానం పై ఆలోచన చేయాలి. దీని కోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలి’’ అని సీఎం అన్నారు.

‘‘అంగన్‌వాడీలలోలను, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వారి పట్ల సానుకూల దృక్పథంతో పనిచేయాలి. 10–12  ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చన్న సీఎం. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టింది’’ అని సీఎం అన్నారు.
చదవండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్‌ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే!

ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎ బాబు, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జీ వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, మార్క్‌ ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top