రాజముద్రతో భూమికి భరోసా కల్పించాం
ఇప్పటికి 40.58 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం
16.48 లక్షల ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించాం
ప్రకాశం జిల్లా మీ భూమి–మీహక్కు సభలో సీఎం చంద్రబాబు
కొండపి (ప్రకాశం జిల్లా): రాష్ట్రంలో భూ వివాదాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో హక్కులను పరిరక్షించేందుకు భూముల రీ సర్వే ప్రక్రియను తానే చేపట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొన్నారు. రీసర్వే 2.0 అనంతరం రాజముద్రతో కూడిన పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామ సభలో ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో భూములపై వివాదాలు సృష్టించారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. గతంలో రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించామన్నారు. వివాదాల్లో ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని 2,315 ఎకరాల గర్భ కండ్రిక భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని అన్నారు. అక్టోబరులోనే 790 గ్రామాల్లో 4 లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. బీసీలకు పెద్ద పీట వేసింది తానే అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


