
నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి
ఎటూ పాలు పోక వైఎస్సార్‌సీపీపై నిందలకు కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ పెద్దలేనన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎప్పటిలాగే డైవర్షన్ రాజకీయంతో ఈ సమస్యను అధిగమిద్దామని చూసినా, అది బెడిసి కొట్టడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎటూ పాలుపోక వైఎస్సార్‌సీపీపై నిందలు వేసి గట్టెక్కుదామనే కుట్రలు చేసినా అవీ ఫలితాన్నివ్వలేదు. ప్రజల్లో పూర్తిగా పలుచనయ్యామని, ఇలాగే చూస్తూ మిన్నకుంటే చాలా నష్టం జరుగుతుందని ఢిల్లీ వేదికగా మరో కుతంత్రానికి తెర తీశారు.
ఈ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైకి నెడుతూ పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెర లేపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వచి్చన చంద్రబాబు అందుబాటులో ఉన్న కూటమి ఎంపీలతో మంగళవారం సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతుంటే.. ఎంపీలుగా మీరంతా ఏం చేస్తున్నారంటూ వారిపై మండిపడినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేయాలనే ఆలోచన మీకు కలగడం లేదా.. అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియకపోతే ఎలా అంటూ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా మాజీ సీఎం జగన్‌కే చుట్టాలని, ఇందుకోసం పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి టార్గెట్ చేయాలని ఎంపీలపై ఒత్తిడి తెచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. ఓ వైపు వైఎస్సార్‌సీపీ.. టీడీపీపై ఉధృతంగా పోరాటం చేస్తుంటే ఇక్కడ మీరు ఉండి ఏం చేస్తున్నారని.. ఇకనైనా మరింత దూకుడుగా మొత్తం వ్యవహారాన్ని ఆ పార్టీపైకి నెట్టాలని దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది.
డైవర్షన్ల మీద డైవర్షన్లు
సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యం చేసుకుని ఎంపీలను ఎగదోయడం పరిపాటిగా మారింది. తాజాగా నకిలీ మద్యం వ్యవహారంలో నిండా మునిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ నకిలీ మద్యం మకిలిని వైఎస్ జగన్‌పై రుద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ‘రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం జరుగుతోంది.
చేసిందంతా వైఎస్ జగనే అని చెప్పాలి కదా? వారి కంటే ముందుగానే సోషల్ మీడియాలో మన యాంగిల్‌లో ప్రచారం చేయాలి కదా.. అలా ఎందుకు చేయడం లేదు? ’అంటూ ఎంపీలపై మండిపడ్డట్టు తెలిసింది. నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది తమ (టీడీపీ) పార్టీ పెద్దలే అనే విషయం తేటతెల్లమయ్యాక, దాన్ని కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీపైకి నెడితే ప్రజల్లో మనం మరింత చులకన అవుతామని కూటమి ఎంపీలు అంటున్నారు. అయినా సూత్రధారి జగనే అంటూ ప్రచారం చేయాలని ఒత్తిడి తేవడంతో.. ఇదెక్కడ గొడవ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఇది సెల్ఫ్ గోల్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.