పేపర్‌పై రాసిస్తే చాలు.. పోగొట్టుకున్న మొబైల్‌.. మీ ఇంటికే!

Chittoor police Recover Stolen Mobile Phones - Sakshi

మొబైల్‌ మిస్సయిందా..? బస్సులో కూర్చున్న వ్యక్తి చోరీ చేశాడా..? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్లను చిత్తూరు పోలీసుశాఖ ట్రాక్‌ చేసి.. దేశంలో ఎక్కడ ఉన్నా వాటిని రూపాయి ఖర్చులేకుండా తీసుకొచ్చి బాధితులకు అందజేస్తోంది. ఇందుకోసం టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌ (టీఏడబ్ల్యూ) పేరిట ఓ ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది.  

సాక్షి, చిత్తూరు: ఇటీవల ఫోన్‌ చోరీ కేసులు పెరిగాయి. ఏదో ఒక చోట తరచూ మొబైల్‌ ఫోన్లు కనిపించకుండా పోతున్నాయి. పోలీస్‌ స్టేషన్లకు ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండడంతో ఈ కేసులు ఛేదించడం తొలుత పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను కనిపెడుతూ మాయమైన ఫోన్లను ఇట్టే పట్టేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి పట్టుబడితే వారిని పోలీసులు కటకటాలపాలు చేస్తున్నారు.  

నిత్యం ఎక్కడో ఓ చోట్ల మొబైల్‌ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. మరికొన్నిసార్లు ఫోన్లు పోగొట్టుకుంటారు. ఇలాంటి మొబైల్స్‌ ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి..? ఎక్కడ ఉన్నాయి..? పోగొట్టుకున్న ఫోన్‌ ఎవరు వాడుతున్నారు..? అనే వివరాలను ఛేదించడానికి చిత్తూరు పోలీసు శాఖలో టీఏడబ్ల్యూ విభాగం పనిచేస్తోంది. ఇక్కడ 30 మంది వరకు పోలీసులు పనిచేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని బాధితులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. మొబైల్స్‌ రికవరీ చేయడంలో టీఏడబ్ల్యూ బృందం ఇప్పటికే పలు రివార్డులు, అవార్డులు అందుకుంది.  

►గతేడాది డిసెంబరు నెలలో రూ.75 లక్షల విలువ చేసే 506 సెల్‌ఫోన్లను చిత్తూరు పోలీసులు పలు ప్రాంతాల నుంచి తెప్పించారు. వీటిలో కొన్ని చోరీకి గురైనవిగా నిర్ధారించి 17 మందిని అరెస్టు చేశారు. మరికొన్ని పోగొట్టుకోగా, వాటిని ఉపయోగిస్తున్న వాళ్లకు ఫోన్‌చేసి చిత్తూరుకు తెప్పించి బాధితులకు అందజేశారు. 
►అదే ఏడాది మే నెలలో రూ.60 లక్షలు విలువ చేసే 405 సెల్‌ఫోన్లను చిత్తూరుకు తెప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చలామణి అవుతున్న మిస్సింగ్‌ మొబైల్స్‌ను మన పోలీసులు ఎలాంటి ఖర్చులేకుండా తీసుకొచ్చి వాటి యజమానులకు అప్పగించారు. 
►2020లో రూ.40 లక్షలు విలువచేసే 277 సెల్‌ఫోన్లను సైతం పలు ప్రాంతాల నుంచి తెప్పించగలిగారు. 
►తాజాగా రెండు రోజుల క్రితం రూ.30 లక్షల విలువైన 300 మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేసిన చిత్తూరు పోలీసులు వాటిని యజమానులకు అప్పగించారు.  

ఇలా చేస్తే సరి..  
సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఆలస్యం చేయకుండా బిల్లు, మొబైల్‌ కొన్నప్పుడు ఇచ్చిన బాక్సును తీసుకెళ్లి సమీపంలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి స్టేషన్‌లో ఇలాంటి ఫిర్యాదులు వస్తే తప్పనిసరిగా రసీదు ఇస్తారు. స్టేషన్‌కు వెళ్లలేనివాళ్లు పోలీస్‌ సేవా యాప్‌ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చు. ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా ఫోన్‌ ఎక్కడుంది..? ఎవరు ఉపయోగిస్తున్నారో పోలీసులు తెలుసుకుంటారు. వాళ్లతో మాట్లాడి ఫోన్లు తెప్పించి.. బాధితులకు సమాచారం ఇచ్చి ఫోన్లను అందచేస్తున్నారు.  

పేపర్‌పై రాసిస్తే చాలు.. 
మొబైల్‌ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఓ పేపర్‌పై ఫిర్యాదు రాసి స్టేషన్‌లో ఇస్తేచాలు. 90 శాతం కేసుల్లో ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేస్తున్నాం. మిగిలినవి తప్పక కనిపెడతాం. కొద్దిగా సమయం పడుతుంది. మీరు ఫిర్యాదు ఇవ్వకుంటే ఆ ఫోన్లతో ఏదైనా క్రైమ్‌ చేసినపుడు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం గుర్తించుకోండి. 
–వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top