రీ సర్వేపై చంద్రబాబు యూటర్న్‌ | Chandrababu Uturn on re survey | Sakshi
Sakshi News home page

రీ సర్వేపై చంద్రబాబు యూటర్న్‌

Jul 25 2024 5:53 AM | Updated on Jul 25 2024 5:53 AM

Chandrababu Uturn on re survey

రీసర్వేపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ దారిలోకి సీఎం

9 రోజుల కిందట రీ సర్వే విఫలయత్నమన్న బాబు

వైఎస్సార్‌సీపీ అనాలోచితంగా చేపట్టిందని, దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటన

రీ సర్వే చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ప్రయోజనాలు ప్రకటించడంతో కొత్త రాగం

రీ సర్వేను హోల్డ్‌ చేశామంటూ శాసన సభలో చెప్పిన బాబు

క్షుణ్ణంగా పరిశీలించాక ముందుకెళ్తామంటూ సన్నాయి నొక్కులు

సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన భూముల రీ సర్వేపై నానా యాగీ చేసి, దాన్ని రద్దు చేస్తామంటూ చిందులేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు దిగొచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ బాటలోకి వచ్చారు. భూముల రీసర్వే చేపట్టే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తామంటూ కేంద్రం ప్రకటించింది. తద్వారా రీ సర్వే సక్రమమేనని తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు దిగిరాక తప్పలేదు. రీ సర్వేపై స్టడీ చేస్తున్నామంటూ శాసన సభలో సన్నాయి నొక్కులు నొక్కారు. 9 రోజుల కిందట తాను తూర్పారబట్టిన కార్యక్రమాన్ని ఈరోజు తానే భుజాలకెత్తుకొనే ప్రయత్నం చేశారు. దీంతో సభలో సభ్యులంతా ఆశ్చర్యపోయారు.

రాష్ట్రంలో గత వందేళ్లుగా భూముల సమగ్ర సర్వే జరగలేదు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక వివాదాలు నెలకొనడంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం పేరుతో రీ సర్వే చేపట్టి, భూ యజమానులను వివాదాల నుంచి బయటపడేసి, వారి భూములకు రక్షణ కల్పించింది. ఇదే చంద్రబాబుకు నచ్చలేదు. రీసర్వేను ఓ అనాలోచితన నిర్ణయమంటూ చిందులు తొక్కారు. ఈ నెల 15న భూ, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల సమయంలో రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నా హయాంలో కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోవడంతో ముందుకు వెళ్లలేదు. 

మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం రీసర్వే తలపెట్టి విఫలమైంది. కానీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వే చేపట్టింది. ఇది విఫల ప్రయత్నమే. ఇకపై భూ యజమానులు వచ్చి వారి హద్దులు నిర్ణయించమని కోరితే తప్ప ఎవ్వరికీ సర్వే చేసే ప్రసక్తి లేదు’ అంటూ ఆరోజు సీఎం చంద్రబాబు హుంకరించారు. అయితే, భూముల రీ సర్వే చేపట్టే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రయోజనాలు, రాయితీలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించింది. 

దీనిద్వారా రీసర్వే మంచి కార్యక్రమమేనని తేల్చిచెప్పింది. దీంతో బాబు ప్రభుత్వం కంగుతింది. వెంటనే సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. బుధవారం చంద్రబాబు అసెంబ్లీలో ‘గత ప్రభుత్వం రీసర్వే మొత్తాన్ని సెటిల్‌మెంట్‌ కోసం చేసింది. డబ్బులైతే ఖర్చుపెట్టింది కానీ, వివాదాలు పెంచేశారు. రీ సర్వేను హోల్డ్‌ చేశాం. స్టే చేశాం. ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చాం’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement