హత్యా రాజకీయాలు.. దుష్ప్రచార కుట్రలు | Chandrababu is once again resorting to his trademark political propaganda | Sakshi
Sakshi News home page

హత్యా రాజకీయాలు.. దుష్ప్రచార కుట్రలు

Apr 24 2026 3:54 AM | Updated on Apr 24 2026 3:54 AM

Chandrababu is once again resorting to his trademark political propaganda

ఇదీ చంద్రబాబు మార్కు కుతంత్రం 

ప్రత్యర్థులపై దుష్ప్రచారం ద్వారా తప్పుదారి పట్టించే కుట్ర

తాజాగా వైఎస్సార్‌సీపీ నేత దస్తగిరి హత్య దారుణంగా వక్రీకరణ

వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తూ దుష్ప్రచారం.. చంద్రబాబు డైరెక్షన్‌లో విష ప్రచార కుట్ర

టీడీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన దస్తగిరి భార్య రమణమ్మ

తన భర్త హత్యతో వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదని స్పష్టీకరణ

ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత హత్యా రాజకీయాలకు ఆద్యుడు బాబే

మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్‌ హత్యల వెనుక చంద్రబాబు హస్తం 

వైఎస్‌ రాజారెడ్డి, వంగవీటి రంగా.. ఇవన్నీ బాబు మార్కు హత్యలే

దివంగత సీఎం వైఎస్‌కూ బెదిరింపు.. ఆ తర్వాత ‘ప్రమాదం’లో మహానేత మృతి

2024 నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్‌ అరాచకం.. మొత్తంగా 710 హత్యలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు మరోసారి తన మార్కు హత్యా రాజకీయ దుష్ప్రచారానికి తెగబ­డుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన ప్రతిసారి డైవర్షన్‌ కుట్రలో భాగంగా ఇటువంటి దుష్ప్రచారానికి తెర తీయడం తన నైజమని మరోసారి నిరూపిస్తు­న్నారు. తాజా­గా వైఎస్సార్‌ కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ కుతంత్రానికి పాల్పడుతున్నారు. టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్‌ మీడియా విభాగాల ద్వా­రా పక్కాగా దుష్ప్ర­చార పన్నాగం పన్నుతు­న్నారు. 

అసలు హతుడు దస్తగిరి భార్య రమణమ్మే ఈ హత్యతో వైఎస్సార్‌­సీపీ నేత నిత్యానందరెడ్డికి ఎటు­వంటి సంబంధం లేదని ప్రకటించినా, టీడీపీ మూకలు మాత్రం విష ప్రచారం కొనసాగిస్తుండ­టం గమనార్హం. దస్తగిరి హత్య ఉదంతాన్ని వక్రీక­రిస్తూ వైఎస్సార్‌సీపీతో­పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డిపై దుష్ప్రచారానికి దిగజారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అసలు రాష్ట్రంలో హత్యా రాజకీ­యా­­­లకు తెరతీసిన చరిత్ర ఉన్న చంద్రబాబు.. వైఎ­స్సార్‌సీపీకి హత్యా రాజకీయాల బురద అంటించాలని యత్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. దాంతో చంద్రబాబు హత్యా రాజకీయాల చరిత్ర మరో­సారి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు దిగజారుడు రాజకీయం 
వైఎస్సార్‌సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఆయన ముఠా విష ప్రచారానికి పాల్పడుతూ దిగజారుడు రాజకీయా­లకు తెగబడుతోంది. ఏకంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, సవిత స్వయంగా ఈ దుష్ప్రచారాన్ని భుజానికెత్తుకోవడం ద్వారా ఈ పన్నాగం అంతా చంద్రబాబు డైరెక్షన్‌­లోనే సాగుతోందన్నది స్పష్టమవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. వైఎస్సార్‌సీపీకి చెందిన పెద్ద దస్తగిరి, నిత్యానంద రెడ్డి అత్యంత సన్నిహిత మి­త్రులు. సుదీర్ఘకాలంగా వారిద్దరూ వ్యాపార భాగస్వాములు. రెండు కుటుంబాలు అత్యంత సన్ని­హితంగా మెలుగుతాయన్నది వైఎస్సార్‌ కడప జిల్లాలో అందరికీ తెలిసిన వాస్తవం. 

ఈ వాస్తవా­లను విస్మరిస్తూ టీడీపీ ముఠా దుష్ప్రచారానికి పాల్పడుతుండటం గమనార్హం. నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అనే కొత్త ప్రచారాన్ని కూడా తెర­పైకి తీసుకువచ్చారు. ఆస్తుల విషయంలో గొడవ­తోనే ఆయన్ను హత్య చేశారని నిధారార ఆరోప­ణ­లతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కాగా ఆ ఆరోపణలను హతుడు దస్తగిరి భార్య రమణమ్మే స్వయంగా ఖండించడం గమ­నా­ర్హం. తన భర్త పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని ఆమె తేల్చి చెప్పారు. అసలు తన భర్త పెద్ద దస్త­గిరికి నిత్యానందరెడ్డితో ఎటువంటి విభేదాలు లేవ­ని ఆమె స్పష్టం చేశారు. అయినా సరే టీడీపీ నేతలు రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారు. 

దర్యాప్తు పేరిట కుతంత్రం 
ఈ హత్య కేసు దర్యాప్తు ముసుగులో వైఎస్సార్‌సీపీ నేతలను వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా పోలీస్‌ స్టేషన్‌ సీఐ రెడ్డప్ప, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్సై రాజేశ్వర రెడ్డిలను హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ట్రాఫిక్‌లో ఉన్న బాలస్వామి­రెడ్డిని ఏరికోరి కడప డీఎస్పీగా నియమించారు. 

ఆ వెంటనే డీఎస్పీ బాలస్వామి రెడ్డి నేతృత్వంలో పోలీ­సుల వేధింపులు మొదలయ్యాయి. బాధిత కుటుంబం అనే సానుభూతి కూడా లేకుండా హతుడు పెద్ద దస్తగిరి నివాసంలో సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారు. వైఎ­స్సార్‌­సీపీ నేత నిత్యానందరెడ్డికి వ్యతిరేకంగా తాము చెప్పిన­ట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వా­లని వారిని వేధిస్తున్నారు. కానీ అందుకు పెద్ద దస్తగిరి కుటుంబ సభ్యులు ఏమాత్రం సమ్మతించ లేదు. 

హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే
హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే హత్యా రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబేనన్నది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. ఆయన హత్యా రాజకీయాల చరిత్ర తిరగేస్తే చాంతాడంత ఉంటుంది. అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతి­పక్ష­ంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడ­టాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసింది చంద్రబాబే.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరే­గిన చంద్రబాబు.. తన ప్రభుత్వ హయాంలో ఇంకెంతగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం. విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమా­నాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండల వరకు.. అన్ని దారుణాల్లో చూపుడు వేలు చంద్రబాబు వైపే చూపిస్తోంది.  

మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి
1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజ­యవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకు­న్నట్టు­గా పోలీసులు ప్రకటించడం గమనార్హం. 

కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

పాత్రికేయుడు పింగళి దశరథరామ్‌ పాశవిక హత్య
టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవా­డకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరామ్‌ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోలేదు. 1985 అక్టోబరు 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథరామ్‌ను దారి కాచి మరీ దారుణంగా దాడి చేశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్పినా సరే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం గమనార్హం. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథరామ్‌ను హత్య చేశారన్నది స్పష్టమైంది. 

చంద్రబాబు అండతోనే వైఎస్‌ రాజారెడ్డి దారుణ హత్య
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్‌ రాజా రెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి, ఆయన వర్గీయులు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారు.  

వంగవీటి రంగా దారుణ హత్య
విజయవాడలో టీడీపీ అరాచకాలకు అడ్డుగోడగా నిలిచిన అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 1988లో నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను పాశవికంగా హత్య చేశారు. టీడీపీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నందునే చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ హత్యకు తెగబడ్డారని పరిశీలకులు స్పష్టం చేశారు. ఆ హత్యలో స్వయంగా పాల్గొని నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009 ఎన్నికల నుంచి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టికెట్‌ ఇవ్వడం గమనార్హం. 

ప్రస్తుతం కూడా విశాఖ టీడీపీలో ఈయన కీలకమే. కాగా, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కంగాటి నారాయణ రెడ్డితోపాటు మరొకరిని 2017లో బాంబులతో దాడి చేసి హత్య చేశారు. చంద్రబాబు అండతోనే అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబమే ఈ హత్యకు కుట్ర పన్నింది.

ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తే 
టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజాందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించే వారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామా­న్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గుర­య్యామని ఆయన చెప్పడం గమనార్హం. 

మహానేత వైఎస్సార్‌కే నేరుగా బెదిరింపు 
2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వరుసగా రెండోసారి సీఎం కావడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 2009లో ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యా­ఖ్యలు విస్మయ పరిచాయి. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’ అని చంద్ర­బాబు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని బెదిరించడం గమనార్హం. అనంతరం కొద్ది రోజు­ల్లోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో దుర్మరణం చెందారు. దాంతో ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన హెచ్చరికలను పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు కూడా. 

2024 నుంచి రెడ్‌బుక్‌ అరాచకం 
2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెడ్‌బుక్‌ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెడ్‌బుక్‌ అరాచకాన్ని ప్రోత్సహిస్తుండటం విస్మయ పరుస్తోంది. 20 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారు. అంటే నెలకో రాజకీయ హత్యతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు 22 నెలల పాలనలో రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement