2014లో ఇచ్చిన వాగ్దానాలూ అమలుచేయని చంద్రబాబు
2024 ఎన్నికల మేనిఫెస్టోపైనా మరోసారి దగా
‘ఉచిత విద్యుత్’ అమలులోనూ కోతలే..
91,300 మంది మగ్గం కలిగిన నేతన్నలున్నట్లు లెక్కతేల్చారు
చివరికి.. 65 వేల మందికే అని మోసం
లబ్దిదారులను తేల్చడంలో చంద్రబాబు మార్కు జాప్యం
చేనేత వ్రస్తాలపై జీఎస్టీ మినహాయింపులోనూ మెలిక
చేనేత సొసైటీల ఎన్నికలపైనా నాని్చవేత ధోరణి
చంద్రబాబు పాలనలో చితికిపోతున్న చేనేతల బతుకులు
‘‘మగ్గాలను పెట్టి.. పోగు పోగు వడికి.. నరాలనే దారాలుగా వస్త్రాలను నేసి.. చెమట చుక్కలనే రంగులుగా అద్ది.. నాగరిక సమాజానికి కట్టుబట్ట అందించిన చేనేత కార్మికులు చంద్రబాబు పాలనలో కష్టాల అల్లికల్లో చిక్కుకున్నారు.’’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుచేయకుండా మరోసారి మోసంచేస్తున్నారు. చేనేత రంగానికి 2014 ఎన్నికల ముందు దాదాపు 25 హామీలిచ్చి అమలుచేయని ఆయన 2024 ఎన్నికల్లోనూ వాగ్దానాలను నెరవేర్చకుండా దారుణంగా దగా చేస్తున్నారు. ప్రధానంగా హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తామని, నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.25 వేలు, జీఎస్టీ మినహాయింపు వంటి హామీల్లో ఒక్కటీ అమలుకాలేదు.
తొమ్మిది నెలలకు జీఓ.. మరో తొమ్మిది నెలలైనా..
అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత ఈ ఏడాది మార్చిలో ఉచిత విద్యుత్‌పై చంద్రబాబు ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అంతే.. ఉచిత విద్యుత్ అమలైపోయినట్లు ఎల్లో గ్యాంగ్ ఊరూవాడా డబ్బా కొట్టింది. చివరికి.. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిõÙకాలు, అభినందన కార్యక్రమాలతో నానా హంగామా చేశారు. తీరా జీఓ ఇచ్చి మరో తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క చేనేత కార్మికుడికి కూడా ఉచిత విద్యుత్ వెలుగులు అందలేదు. కారణం.. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీచేయకపోవడంతో పాటు లబ్దిదారులనూ ఖరారుచేయలేదు.
అమలులేదు.. లబ్ధిదారుల జాబితాలో కోతలు..
ఉచిత విద్యుత్ పథకం అమలుచేయకపోయినా.. లబ్దిదారుల జాబితాకు కోతలు పెట్టడంలో మాత్రం బాబు ప్రభుత్వం నానా హడావుడి చేస్తోంది. నిజానికి.. ఈ ఏడాది మార్చిలో జీఓ ఇచ్చిన ప్రభుత్వం.. ఉచిత విద్యుత్‌వల్ల 91,300 చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని ప్రకటించింది. ఆ తర్వాత సొంత చేనేత మగ్గాలున్న 50 వేల మందికి, మర మగ్గాలున్న 15 వేల మందికి కలిపి మొత్తం 65 వేల మందికి మాత్రమే లబ్ధి కలగనుందని అడ్డగోలుగా కుదించింది.
లబ్ధిదారుల లెక్కలపై సీఎం, మంత్రి సైతం పొంతనలేని మాటలు చెప్పారు. రాష్ట్రంలో హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్‌లకు ఉచిత విద్యుత్ పథకంలో మొత్తం 1.43 లక్షల మందికి రూ.190 కోట్ల లబ్ధి అని సీఎం ప్రకటిస్తే.. మొత్తం 65 వేల మందికి రూ.125 కోట్ల లబ్ధి అని మంత్రి సవిత ప్రకటించారు. ఇక పథకం అమలయ్యేసరికి ఎంతమందిని జాబితా నుంచి తీసేస్తారో..!
జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌లో మెలిక..
చేనేత వ్రస్తాలపై జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ (తిరిగి చెల్లింపు) చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హమీ సైతం మోసపూరితమని నేతన్నలు మండిపడుతున్నారు. చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్నులు వేయకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్–43 చెబుతోంది.
అయినప్పటికీ రూ.వెయ్యిలోపు చేనేత వ్రస్తాల విక్రయాలపై ఐదు శాతం జీఎస్టీ, రూ.వెయ్యి దాటితే 12 శాతం జీఎస్టీ వసూలుచేస్తున్నారు. నిజానికి.. వినియోగదారులే జీఎస్టీ చెల్లిస్తున్నారు. చేనేతను ఆదుకునేలా జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ మొత్తాన్ని ఎవరికి చెల్లిస్తారో స్పష్టత ఇవ్వలేదు. దానికంటే చేనేత వ్రస్తాలపై జీఎస్టీ రద్దుచేస్తే మేలు జరుగుతుందని నేతన్నలు అంటున్నారు.
చేనేత సంఘాల ఎన్నికలూ తాత్సారం..
చేనేత సహకార ఎన్నికలు అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినా అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టకపోవడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యత్వాల పరిశీలన, కొత్త సంఘాల నమోదు వంటి అంశాలపై హడావుడి చేసిన ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై మాత్రం నాని్చవేత ధోరణి అవలంబిస్తోంది.
రాష్ట్రంలో సుమారు వెయ్యి చేనేత సహకార సంఘాలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నప్పటికీ వాటిలో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయి? సభ్యులు ఎంతమంది? అనేది తేల్చలేకపోయింది. చేనేత సహకార సంఘాలకు, వాటి పరిధిలో పనిచేసే చేనేత కళాకారులకు రూ.127.87 కోట్ల బకాయిలు చెల్లించలేదు.
నేతన్నకు దన్నుగా జగన్..
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో చేనేతల కోసం కేవలం రూ.442 కోట్లే ఖర్చుచేసింది. కానీ, 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అంతకుముందున్న ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.3,706 కోట్లకు పైగా ఖర్చుచేసింది. ఒక్క వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారానే ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు వారి ఖాతాల్లో జమచేశారు.
నేతన్న నేస్తం పథకం ద్వారా మొత్తం రూ.982.98 కోట్ల ఆర్థిక సాయం అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇలా జగన్ అందించిన చేయూతతో చేనేత కుటుంబాల్లో సగటు ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆయా కుటుంబాల్లో 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే.. జగన్ అందించిన ప్రోత్సాహంతో ఏకంగా మూడురెట్లు పెరిగి రూ.15 వేలకు పైగా ఆదాయం ఆర్జిస్తూ నిలదొక్కుకున్నారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ నేతన్న నేస్తంతోపాటు ప్రత్యేకంగా కోవిడ్ సాయం అందించి జగన్ ఆదుకున్నారు.
మంత్రి సవిత చులకనగా మాట్లాడుతున్నారు..
రాష్ట్రంలో చేనేత రంగాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. చేనేత సహకార సంఘాలు, మాస్టర్ వీవర్స్ వద్ద పనిచేసే ప్రతి చేనేత కార్మికుడికి ఉచిత విద్యుత్ అందించాలి. ఇదే విషయంపై ఇటీవల మంత్రి సవితతో మాట్లాడితే వారికి పెన్షన్ ఇస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారు. అందరికీ ఇస్తున్నట్లే చేనేతలకూ ఇస్తున్నారని అంటూ మంత్రి చులకనగా మాట్లాడుతున్నారు. – పిల్లలమర్రి బాలకృష్ణ, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హామీలు అమలు చేయాలి..
చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ హామీలను త్వరగా అమలుచేసి ఆదుకోవాలి. ప్రధానంగా చేనేత వర్గాలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి. వీవర్స్‌కు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ఆర్థిక తోడ్పాటు అందించాలి. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షులు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్


