లేని మద్యం స్కామ్‌పై సిట్‌ కట్టుకథలు | Chandrababu Naidu Govt SIT Fake Story On Liquor Scam In Andhra Pradesh, Read Story For More Details Inside | Sakshi
Sakshi News home page

లేని మద్యం స్కామ్‌పై సిట్‌ కట్టుకథలు

Jul 22 2025 4:10 AM | Updated on Jul 22 2025 11:27 AM

Chandrababu Naidu Govt SIT Fake Story liquor Scam in Andhra Pradesh

జరగని స్కామ్‌లో రూ.3,500 కోట్ల దోపిడీ అంటూ భేతాళ విక్కమార్క కథ 

సిట్‌ చార్జ్‌షీట్‌ సాక్షిగా వెల్లడైన బాగోతం

స్కామ్‌ జరక్కపోయినా సిట్‌ దుష్ప్రచార కుట్ర 

అసలు స్కామే లేనపుడు డబ్బులెక్కడివి? ఇచ్చేదెవరు? తీసుకున్నదెవరు? 

ముక్కూ మొహం తెలియని వారి వాట్సాప్‌ చాట్‌లో ఎవరి పేరులో ఉన్నాయని వీరే నేరం చేశారంటూ వితండవాదం 

ఎవరెవరి ఆస్తులో చూపిస్తూ అవి మీవేనంటూ అభూతకల్పనలు

అలాగైతే ఈనాడు రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడులు బాబు బినామీలనాలా? 

రామోజీ, రాధాకృష్ణ ఆస్తులు చంద్రబాబు ఆస్తులేనా? 

2014–19 మధ్య ఊరూరా బెల్ట్‌ షాపులతో మద్యం దోపిడీకి పాల్పడింది చంద్రబాబే.. 

నేడు అంతకుమించి మద్యం దందాకు తెగబడుతున్న బాబు 

గతంలోనే సీఐడీ దర్యాప్తులో దొరికిపోయిన బాబు అండ్‌కో 

సీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్న చంద్రబాబు 

తన దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు.. అరెస్టులు

సిట్‌ దర్యాప్తు పేరుతో భేతాళ విక్రమార్క కథలు... 

లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించే పన్నాగంతోనే తయారైన చార్జ్‌షీట్‌.. కోర్టుకు సమర్పించడానికంటే ముందే పేజీల సంఖ్యతో సహా ఎల్లో మీడియాకు వివరాలు

చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు.. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌కు గతి లేదు! ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి..వైఎస్సార్‌సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత హడావుడి చేసిన సిట్‌ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు..వైఎస్సార్‌సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది..

బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించినది ఏమీ లేదన్నది సిట్‌ చార్జ్‌జషీటే వెల్లడిస్తోంది. ఇదిగో పెళ్లిలో వీరిద్దరూ కలిశారు కాబట్టి కుంభకోణానికి పాల్పడ్డారు.. అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు వారిద్దరు ఒకరికి ఒకరు కనిపించగానే నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుఠాణి చేసి ఉంటారు... ఇదీ సిట్‌ తన చార్జ్‌షీట్‌ సాక్షిగా వెల్లడించిన నివేదిక.. ప్రపంచంలో ఇంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన ఘనత చంద్రబాబు సిట్‌కే దక్కుతుంది. 

కూటమి పెద్దల కుట్రకు తలాడించడం తప్ప ఏమీ చేయలేని సిట్‌... కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లు అంటూ వక్రభాష్యం చెబుతూ కనికట్టు చేసేందుకు ప్రయత్నించడం విస్మయపరుస్తోంది. రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ తాడూ, బొంగరం లేని కట్టు కథతో దుష్ప్రచారం చేయాలన్న కుతంత్రమే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది. మోకా­లికి, బోడిగుండుకు ముడిపెడుతూ రాజ్‌ కేసిరెడ్డి ద్వారా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్‌ ఐఏ­ఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి  ద్వారా డబ్బులు చేతులు మారాయని నమ్మించేందుకు సృష్టించిన కల్పిత కథ బెడిసికొట్టింది.

సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ బినామీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్‌ కేసిరెడ్డి అన్న వాస్తవం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో డిస్టిలరీల ముసుగులో మద్యం దోపిడీ చంద్రబాబు బాగోతేమనని సీఐడీ నిగ్గు తేల్చిన సంగతిని అందరికీ గుర్తు చేసింది. ఆ కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ప్రస్తుతం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నీతి కథలు చెబుతుండటం విస్మయపరుస్తోంది. బాబు కనికట్టు కథను ముందుగానే ఎల్లో మీడియా చిలక జోస్యం చెప్పడంతో రెడ్‌బుక్‌ కుతంత్రం బట్టబయలవుతోంది.

కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ అంటూ బురిడీ కుట్ర
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టు చూపించేందుకు టీడీపీ వీర విధేయ సిట్‌ నానా తంటాలు పడుతోంది. నెలల తరబడి దర్యాప్తు పేరుతో వేధించినా, బెదిరించినా సాధించిందేమీలేదు. చివరికి చార్జ్‌జషీట్‌లో ఏం చెప్పిందంటే... 13 వేల ఫోన్‌ కాల్స్, వందలాది వాట్సాప్‌ చాటింగ్‌ల డేటా అంటూ వక్రీకరణలతో కనికట్టుకు యత్నించింది. అంటే దర్యాప్తు పేరుతో తాము సాధించిందీ ఏమీ లేదని ఒప్పుకొంది. ఓ ఇరవై ముప్పై మంది ఫోన్లతో పాటు వారి పీఏలు, సిబ్బంది ఫోన్ల నుంచి రెండేళ్ల సుదీర్ఘ కాలంలో 13 వేలకుపైగా ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి అన్నది ఏదో అసహజ విషయం అన్నట్టు నమ్మించేందుకు సిట్‌ యత్నించింది. 

పోనీ ఆ కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లో మద్యం కొనుగోళ్లు, సరఫరా, డబ్బుల చెల్లింపు వంటి వ్యవహారాల గురించి ఏమైనా ఉన్నట్టు సిట్‌ నిరూపించిందా? అంటే అదీ లేదు. కేవలం మీటింగులు, ప్రయాణాలు, సాధారణ విషయాలే ఉన్నట్టు సిట్‌ చార్జ్‌జషీట్‌లోనే పేర్కొంది. ఆ సాధారణ ఫోన్‌కాల్స్, చాటింగ్‌లకు వక్రభాష్యం చెబుతూ తమ రెడ్‌కుట్ర కథను ఆపాదిస్తూ అటు న్యాయస్థానాన్ని ఇటు ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం అన్నది స్పష్టమవుతోంది.

బాబు కుతంత్రం... ఎల్లో మీడియా చిలక జోస్యం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించే రెడ్‌బుక్‌ కుట్ర కోసం చంద్రబాబు తన భజన ఎల్లో మీడియానే నమ్ముకున్నారు. అసలు సిట్‌ ఏమేం చేయాలో కూడా తన రాజగురువు రామోజీ కుటుంబానికి చెందిన ఈనాడు పత్రిక ద్వారా చెప్పిస్తున్నారు. ఎవరెవరి మీద అక్రమ కేసు పెట్టాలి... ఎవరెవర్ని విచారణకు పిలవాలి... వారిని ఏఏ ప్రశ్నలు అడగాలి... ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలి అన్నవి ముందుగా ఈనాడు పత్రికలో ప్రచురితమవుతాయి. సిట్‌ అదే పనిని తు.చ. తప్పకుండా చేస్తోంది. 

న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై సిట్‌కు ఎలాంటి నియంత్రణ ఉండకూడదు. అది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఆ చార్జ్‌షీట్‌ను  స్వీకరించినట్టు ప్రకటించిన తరువాతే ఎవరైనా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కాపీని తీసుకోవచ్చు. కానీ, న్యాయస్థానం స్వీకరించినట్టు ప్రకటించకముందే చార్జ్‌జషీట్‌ ఎల్లో మీడియాకు చేరిపోతోంది. అంటే కోర్టు కంటే ఎల్లో మీడియాకే తమ ప్రాధాన్యం అని చంద్రబాబు ప్రభుత్వం, సిట్‌ బరితెగించి ప్రకటిస్తున్నాయి. 

రాజ్‌ కేసిరెడ్డి.. లోకేశ్‌ బినామీ 
కేశినేని చిన్ని భాగస్వామి 
ఈ మొత్తం భేతాళ కుట్ర కథకు చంద్రబాబు ప్రధాన ఆధారంగా చేసుకున్నది రాజ్‌ కేసిరెడ్డినే. ఇంతకీ ఈ రాజ్‌ కేసిరెడ్డి ఎవరో తెలుసా...? నారా లోకేశ్‌కు బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని)కు వ్యాపార భాగస్వామి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండగానే అంటే 2021లోనే రాజ్‌ కేసిరెడ్డి కేశినేని చిన్నితో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. చిన్ని లోకేశ్‌ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్‌ఫ్రాకాన్‌ ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. 

అక్రమంగా నిధులు తరలించారని సిట్‌ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌­ఫ్రా ప్రాజెక్టస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీహిల్స్, సర్వే నంబర్‌ 403, ప్లాట్‌ నంబర్‌ 9)తో రిజిస్టర్‌ అయ్యాయి. అంతేకాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్‌ ఐడీ (accounts@­wshanviinfra­projects.com)నే ఉపయోగిస్తుండడం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్‌ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌ తరలించి పెట్టుబడులు పెట్టారు. 

కేశినేని చిన్ని మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాక బినామీ కావడంతో పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్‌ ఇప్పించారు. ఆంధ్రా క్రికెట్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిని చేశారు. చిన్ని బినామీ కంపె­నీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు  విశాఖలో అత్యంత విలు­వైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. చిన్ని ముసుగులో లోకేశ్‌ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. 

అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. అలాంటి రాజ్‌ కేసిరెడ్డి..వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని సిట్‌ నమోదు చేసిన అభియోగం పూర్తిగా అవాస్తవమే అన్నది నిగ్గు తేలుతోంది. దీనిపై అటు చంద్రబాబు­గానీ ఇటు సిట్‌గానీ స్పందించకుండా మౌనం వహించ­డం అంటే ఆ వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే.

బాబు కుట్ర కథే... సిట్‌తో ఆడిస్తున్న తోలుబొమ్మలాటే
చంద్రబాబు సిట్‌ ద్వారా రెడ్‌బుక్‌ తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. రెడ్‌బుక్‌ కుట్ర అమలుకు సిట్‌ ఆయుధంగా మారిందని తాజాగా సమర్పించిన చార్జ్‌జషీట్‌ స్పష్టం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపాలన్న టీడీపీ కూటమి కుట్రను సిట్‌ తు.చ. తప్పక అమలు చేస్తోంది. కొత్త కొత్త భేతాళ కథలను తమ రిమాండ్‌ రిపోర్టులు, చార్జ్‌జషీట్‌ ద్వారా ప్రచారంలోకి తెస్తోంది. 

ఎంతగా అంటే అసలు జరగని కుంభకోణంలో ఏకంగా రూ.3,500 కోట్లు చేతులు మారాయని నిస్సిగ్గుగా కట్టుకథను వినిపించడం సిట్‌కే సాధ్యపడింది. రాజ్‌ కేసిరెడ్డి, విజయ సాయిరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ సంస్థ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప... ఇలా ఒకరినుంచి ఒకరికి రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ పకడ్బందీ కుట్రకథను అల్లడం బాబు మార్కు కుతంత్రానికి తార్కాణం. అసలు రూ.3,500 కోట్లు ఎక్కడ ఉన్నాయంటే సిట్‌ చెప్పదు... చెప్పలేదు. ఎందుకంటే రూ.3,500 కోట్ల అవినీతి అన్నది చంద్రబాబు సృష్టించిన కల్పిత కథ.

⇒ ఓవైపు రూ.3,500 కోట్లు అక్రమంగా తరలించారని సిట్‌ అవాస్తవ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు ఆ నిధులతో నిందితులు దుబాయ్‌ తదితర విదేశాల్లో జల్సాలు చేశారని అంటోంది. అంటే రెడ్‌బుక్‌ కుట్రను అమలు చేసే ఆత్రుతలో సిట్‌ పరస్పర విరుద్ధంగా అవాస్తవ అభియోగాలు ప్రచారంలోకి తెస్తోందని వెల్లడైంది. ఇదంతా సిట్‌ ద్వారా  చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటేనన్నది అసలు వాస్తవం. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నది సుస్పష్టం.

డీబీటీ పథకాలు రూ.2.70 లక్షల కోట్లు 
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా ఐదేళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించింది. అంతటి పేదల సంక్షేమ ప్రభుత్వంపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తోంది.

డిస్టిలరీల ద్వారా భారీ దోపిడీ చంద్రబాబు బాగోతమే
డిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కట్టుకథలు వినిపిస్తుండడం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉంది. ఎందుకంటే డిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. 

ఇక బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్‌ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. తన సన్నిహితులు, బినామీలు అయ్యన్నపాత్రుడు, పుట్టా సుధాకర్‌యాదవ్, డీకే ఆదికేశవులు, ఎస్పీవైరెడ్డి కుటుంబాలకు చంద్రబాబు డిస్టిలరీల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేశారు. 

తన బినావీులకు చెందిన 4 డిస్టిలరీలకే ఏకంగా 60 శాతానికి పైగా మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారు. అందుకోసం ముందుగానే మద్యం నిల్వలను తెప్పించి సరఫరా చేశారు. అంటే మద్యం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లించినట్టేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, అప్పటివరకు ఊరూపేరు లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు డిస్టిలరీల ముఠానే. 

రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం సిండికేట్‌కు టీడీపీ నేతలే నేతృత్వం వహించారు. అందుకే... డిస్టిలరీలు, బార్‌లకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేలా ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసేందుకు మంత్రి మండలిని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. 

టీడీపీ సిండికేట్‌కు చెందిన 4,380 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్‌ రూమ్‌లతో పాటు ఊరూవాడా బడి దగ్గర గుడి దగ్గర కూడా ఏకంగా 43 వేల బెల్ట్‌ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక విక్రయాలతో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా దోపిడీని 2023లోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. 

చంద్రబాబుతో పాటు టీడీపీ గత ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ఐఎస్‌ నరేష్‌ తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్‌విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1),(డి), రెడ్‌విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగానే మద్యం విధానం
నాడే తేల్చిచెప్పిన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగానే మద్యం విధానాన్ని అమలు చేశారని  కేంద్రానికి చెందిన ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆనాడే ప్రకటించింది. టీడీపీ నేతలు 2021లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై సీసీఐకి ఫిర్యాదు చేశారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్ప­డుతున్నారని ఆరోపించారు. 

ఆ ఫిర్యాదుపై విచారించిన సీసీఐ 2022 సెప్టెంబర్‌19న విస్పష్ట తీర్పు ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. నాడు సీసీఐ తీర్పునకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సిట్‌ అక్రమ కేసు నమోదు చేసి నిరాధార అభియోగాలు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్‌ కుట్రే.

సమర్థంగా దశలవారీ మద్య నియంత్రణ
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఘనత
మద్యం అమ్మకాలు, లాభాలు తగ్గితే డిస్టిలరీలు ఎందుకు లంచాలు ఇస్తాయి బాబూ?
డిస్టిలరీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భారీ కమీషన్లు ఇచ్చాయని చంద్రబాబు తన పచ్చ పోలీసు ముఠా సిట్‌తో దుష్ప్రచారం చేయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అటు చంద్రబాబు ఇటు సిట్‌ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న వాస్తవం ఏమిటంటే... డిస్టిలరీలు సాధారణంగా కమీషన్లు ఎప్పుడు ఇస్తాయి...? తమ మద్యం అమ్మకాలు పెరిగితే... తద్వారా తమకు అధిక లాభాలు వస్తే కమీషన్లు ఇస్తాయి. 

ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన సత్యం. మరి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయా...? పెరిగాయా అన్నది పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది కదా...? ఆ చిన్న లాజిక్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు...? ఎందుకంటే  2019–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 

అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేశారు. అంతకుముందు టీడీపీ పాలనలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలను ప్రవేశపెట్టి, వాటి వేళలను కుదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించారు. 

చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించారు. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్‌కు క్యూఆర్‌ కోడ్‌ పెట్టి పకడ్బందీగా పర్యవేక్షించారు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ రికార్డులే వెల్లడిస్తున్నాయి. 

మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. అయినా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డిస్టిలరీలకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించిందని సిట్‌ అవాస్తవ అభియోగాలు నమోదు చేసింది.

అటు సిండికేటు.. ఇటు కల్తీ కేటుగాళ్లు...
ఇక నిరుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతంలోని తన రికార్డులను తానే తిరగరాస్తూ మద్యం దోపిడీకి తెగబడుతోంది. టీడీపీ సిండికేట్‌కు 3,396 మద్యం దుకాణాలను కట్టబెట్టి 75 వేల బెల్ట్‌ దుకాణాలతో మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అత్యంత ప్రమాదకర స్పిరి­ట్‌ను అక్రమంగా దిగుమతి చేస్తూ కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 

కల్తీ మద్యం తయారీ యూనిట్లు కొన్నింటిని ఇటీవల ఎక్సైజ్‌ శాఖ అధికారులు గుర్తించి కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. అసలు సూత్రధారులైన టీడీపీ పెద్దల జోలికి వెళ్లకుండా ఎక్సై­జ్‌ శాఖను ప్రభుత్వ పెద్దలు కట్టడి చేసింది. అలాంటి బాబు డిస్టిలరీల పేరుతో వైఎస్సార్‌సీ­పీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది.

రామోజీ, రాధాకృష్ణ కుటుంబాల ఆస్తులన్నీ బాబువేనా?
చంద్రబాబు కుట్ర ఎంత హాస్యాస్పదంగా ఉందంటే... కంటికి కనిపించే వారి ఆస్తులన్నీ వైఎస్‌ జగన్‌వేనని సిట్‌తో కట్టుకథలు చెప్పిస్తున్నారు. మరి ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 తదతర ఎల్లో మీడియాతో చంద్రబాబు అక్రమ సంబంధం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం కావడానికి 1995లో వైస్రాయ్‌ హోటల్‌ జరిగిన కుట్రలో ఆయన రాజ గురువు రామోజీరావు భాగస్వామి. 

ఆ తర్వాత వారి అవినీతి బంధం ఊడలు వేసింది. బాబు అండతోనే రామోజీ కుటుంబం ఫిలింసిటీ పేరుతో వేలాది ఎకరాలు గుప్పిట పట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసుగులో నల్లధనం దందా సాగిస్తోంది. అంటే, రామోజీ కుటుంబం ఆస్తులన్నీ చంద్రబాబు ఆస్తులే అవుతాయి కదా..? అంతేకాదు రామోజీ దగ్గర బంధువులకు, రామోజీ కుటుంబంతో వియ్యమందిన వారికి పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం, బందరు పోర్టు కాంట్రాక్టులు కట్టబెట్టింది. 

అంటే, వారి ఆస్తులన్నీ చంద్రబాబువేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకొంటుందా...! ఇక టీడీపీ భజన బ్యాచ్‌ ఆంధ్రజ్యోతి– ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 బీవీఆర్‌ నాయుడులకు చెందిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయి కదా..? రాధాకృష్ణ డొక్కు సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చి చేతికి అంటిన గ్రీజును తన చాంబర్‌కు వచ్చి కడుక్కున్నారని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అసెంబ్లీలోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. 

అటువంటి రాధాకృష్ణ ఏకంగా పేపర్, టీవీ చానల్‌ పెట్టడంతో పాటు విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పడం వెనుక ఉన్నది చంద్రబాబే కదా...? ఆ వాస్తవాన్ని చంద్రబాబు అధికారికంగా అంగీకరించి వారందరి ఆస్తులను తన ఆస్తుల జాబితాలో ప్రకటించాలి. మరి అందుకు సిద్ధమా చంద్రబాబూ..!? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement